: సెమీస్‌లో ఇంగ్లండ్ ఘోర పరాజయం.. తొలిసారి చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాక్!


చాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌లో సంచలన విజయంతో పాకిస్థాన్ తొలిసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలియని ఆ జట్టు ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించింది. ట్రోఫీలో తొలి నుంచి దుమ్మురేపుతున్న ఇంగ్లండ్ కీలక మ్యాచ్‌లో చతికిల పడింది. పాక్ బౌలర్ల దెబ్బకు మరో బంతి మిగిలి ఉండగానే 211 పరుగులకు కుప్పకూలి ప్రత్యర్థి ముందు స్వల్ప విజయ లక్ష్యాన్ని ఉంచింది. ఈ టోర్నీలో ఇంగ్లండ్ చేసిన అతి తక్కువ పరుగులు ఇవే. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ 37.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. మూడు వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించిన పాక్ బౌలర్ హసన్ అలీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ పేలవ ప్రదర్శనతో చతికిల పడింది.  పాక్ బౌలర్ల నుంచి పరుగులు రాబట్టు కోవడంలో మోర్గాన్ సేన విఫలమైంది. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. నిప్పులు చెరిగే బంతులతో హసన్ అలీ ఇంగ్లిష్ బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించాడు. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌లలో జానీ బెయిర్‌స్టో (43) జో రూట్  (46), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (33), బెన్ స్టోక్స్ (34) మినహా మిగతా వారెవరూ కనీసం 15 పరుగులు కూడా చేయలేకపోయారు. దీంతో 49.5 ఓవర్లలోనే ఇంగ్లండ్ 211 పరుగులకు ఆలౌట్ అయింది. పాక్ బౌలర్లలో హసన్ అలీ మూడు, జునైద్ ఖాన్, రుమాన్ రాయీస్ చెరో రెండు వికెట్లు నేల కూల్చగా షాదాబ్ ఖాన్ ఒక వికెట్ పడగొట్టాడు.

అనంతరం 212 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ 37.1 ఓవర్లలోనే 215 పరుగులు చేసి అలవోకగా విజయం సాధించింది. ఓపెనర్లు అజర్ అలీ (76), ఫఖర్ జమాన్ (57)లు జాగ్రత్తగా ఆడుతూ 100  పరుగుల వరకు వికెట్ కోల్పోకుండా అడ్డుకున్నారు. 118 పరుగుల వద్ద జమాన్ అవుటయ్యాడు. అనంతరం బరిలోకి దిగిన బాబర్ ఆజం (38)తో కలిసి జాగ్రత్తగా ఆడిన అజర్ స్కోరు బోర్డును ఉరకలెత్తించాడు.  ఈ క్రమంలో 173 పరుగుల వద్ద అలీ అవుటయ్యాడు. అనంతరం బరిలోకి దిగిన మొహమ్మద్ హఫీజ్ (31) మరో వికెట్ కోల్పోకుండా జాగ్రత్తగా ఆడుతూ ఆజంతో కలిసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ బాల్, ఆదిల్ రషీద్‌లు చెరో వికెట్ పడగొట్టారు. ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లిన పాక్.. నేడు  భారత్-బంగ్లాదేశ్ మధ్య జరగనున్న రెండో సెమీస్‌ విజేతతో ఆదివారం ఫైనల్స్‌లో తలపడుతుంది.

  • Loading...

More Telugu News