: రూ. 82 కోట్లతో ఓ ఇంటివాడవుతున్న పేటీఎం బాస్!
డిజిటల్ చెల్లింపు సేవల సంస్థ పేటీఎం వ్యవస్థాపకుడు, నోట్ల రద్దు తరువాత గణనీయంగా వ్యాపారాన్ని విస్తరించుకున్న విజయ్ శేఖర్ శర్మఇండియాలోనే అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన న్యూఢిల్లీ, గోల్ఫ్ లింక్స్ లో రూ. 82 కోట్లతో ఓ ఇంటిని కొనుగోలు చేయనున్నారు. లుత్యన్స్ జోన్ లో 6 వేల చదరపు అడుగుల విస్తీర్ణమున్న ఇంటిని కొనుగోలు చేసేందుకు అడ్వాన్స్ ఇచ్చి, అగ్రిమెంట్ చేయించుకున్నారని, ఈ లావాదేవీ ఇంకా రిజిస్టర్ కాలేదని తెలుస్తోంది. దేశంలో ఫ్లిప్ కార్ట్ అనంతరం రెండో అత్యధిక విలువైన ఇంటర్నెట్ సంస్థగా పేటీఎంకు పేరున్న సంగతి తెలిసిందే.
కాగా, ఈ డీల్ కు కన్సల్టింగ్ సంస్థ సీబీఆర్ఈ మధ్యవర్తిత్వం చేసినట్టు సమాచారం. ఈ విషయమై అధికారికంగా స్పందన కోరగా, పేటీఎం ప్రతినిధి ఒకరు నిరాకరించారు. పేటీఎంలో 16 శాతం వాటా ఉన్న శర్మ, ఆస్తుల విలువ 1.3 బిలియన్ డాలర్లు కాగా, గత సంవత్సరం ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో చోటు సంపాదించుకున్న అతిచిన్న భారత వ్యక్తిగా శర్మ నిలిచారు. సుమారు 1000 బంగ్లాలతో 3000 ఎకరాలలో విస్తరించి ఉన్న ఢిల్లీ లుత్యన్స్ ప్రాంతంలో 70 ఎకరాలను మాత్రమే ప్రైవేట్ గా వాడుతున్నారు. మిగతా అన్ని భవనాలు ప్రభుత్వం అధీనంలోనే ఉన్నాయి.