: మరోసారి తప్పు చేయవద్దు... ఉత్తర కొరియాకు చైనా సూచన
మిడ్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించామని ఉత్తర కొరియా ప్రకటించిన నేపథ్యంలో, చైనా కీలక సూచనలు చేసింది. ఐక్యరాజ్యసమితి అణు పరీక్షలు, క్షిపణి పరీక్షలపై గతంలో చేసిన తీర్మానాలను పాటించాలని, వాటిని తుంగలో తొక్కుతూ, మరోసారి తప్పు చేయవద్దని సూచించింది. చైనా విదేశాంగ మంత్రి వాంయీ మాట్లాడుతూ, చేసిన ప్రయోగాలు చాలని, ఇంకా ముందుకెళ్లి ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దని ఉత్తర కొరియాకు హితవు పలికారు.
ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలను చైనాలోని అన్ని పార్టీలూ ఖండించాయని తెలిపారు. కాగా, క్షిపణి పరీక్షల విషయంలో దూకుడుగా ఉన్న ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్, ఇటీవలి కాలంలో వరుసగా ప్రయోగాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అణు వార్ హెడ్ లను మోసుకుని 2000 కిలోమీటర్ల దూరానికి పైగా వెళ్లగల క్షిపణులు కొరియా వద్ద ఉన్నాయని తెలుస్తుండగా, ఈ దూరాన్ని కనీసం 3,500 కిలోమీటర్ల వరకూ పెంచాలని కిమ్ లక్ష్యంగా పెట్టుకున్నట్టు సమాచారం. ఈ మేరకు క్షిపణుల సామర్థ్యాన్ని పెంచాలని ఆయన తన శాస్త్రవేత్తల బృందానికి ఆదేశాలు కూడా ఇచ్చారు.