: రైలు పట్టాలు తప్పిందని భ్రమపడిన ప్రయాణికులు.. రైలు దిగి పరుగో పరుగు!
ఫలక్‌నుమా నుంచి షోలాపూర్ వెళ్తున్న ప్యాసింజర్ రైలు శుక్రవారం నాగులపల్లి-లింగంపల్లి రైల్వే స్టేషన్ల మధ్య పెద్ద శబ్దంతో గంటపాటు నిలిచిపోయింది. దీంతో రైలు పట్టాలు తప్పిందని భావించిన ప్రయాణికులు భయంతో రైలు దిగి పరుగులు తీశారు. నిజానికి రైలు పట్టాలు తప్పలేదు. ఈ లైన్‌లో పట్టాలకు ఇరువైపులా కంకర పోసే పనులు జరుగుతున్నాయి. రైలు ఆ ప్రాంతానికి చేరుకోగానే బోగీలు ఒకవైపు ఒరిగిపోయి కంకరరాళ్లు తగిలి పెద్ద శబ్దం రావడంతో డ్రైవర్ రైలును ఆపేశాడు.
దీంతో రైలు పట్టాలు తప్పిందని భ్రమపడిన ప్రయాణికులు రైలు దిగి పరుగులు పెట్టారు. గంటపాటు రైలు నిలిచిపోవడంతో చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతులు చేశారు. పనులు జరుగుతుండడంతో రైలును నెమ్మదిగా పోనివ్వాలని డ్రైవర్‌కు సూచించారు. దాదాపు అరకిలోమీటరు దూరం నెమ్మదిగా ప్రయాణించాక ప్రయాణికులు తిరిగి రైలెక్కారు.