: ఎండలు మండిపోతున్నది ఇందుకేనట!.. వెల్లడించిన వాతావరణ కేంద్రం
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోవడానికి కారణం ఏంటో హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర, వాయవ్య దిశల నుంచి వీస్తున్న గాలులే ఇందుకు ప్రధాన కారణమని పేర్కొంది. ఇటీవల దక్షణ, ఆగ్నేయాసియా దిశ నుంచి వీచిన తేమ గాలులకు తోడుగా ఉపరితల ద్రోణి ఏర్పడడంతో వర్షాలు పడ్డాయని, ఇది కూడా మరో కారణమని వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. ప్రస్తుతం గాలుల దిశ మారడంతో ఉపరితల ద్రోణి బలహీనపడిందని పేర్కొన్నారు. రేపు (గురువారం) కూడా తెలంగాణతోపాటు దక్షిణ కోస్తాంధ్రలో ఎండలు మండిపోయే అవకాశం ఉందని, సాధారణం కంటే ఐదారు డిగ్రీలు అదనంగా నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు బయటకు వచ్చేముందు తగు జాగ్రత్తలు తీసుకోవాలని రాజారావు సూచించారు.