: 'ప్రభాస్ తో నటించడం చాలా ఇష్టం' అంటూనే... బాలీవుడ్ భామాలు ఎంతేసి డిమాండ్ చేశారో తెలుసా?
'బాహుబలి-2:ద కన్ క్లూజన్' సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా మరింత అభిమానులను సంపాదించుకున్న ప్రభాస్ సరసన నటించేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నామంటూ బాలీవుడ్ హీరోయిన్లు పలువురు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో మహేష్ పేరు జపించే వీరంతా ఇప్పుడు ప్రభాస్ నామాన్ని జపిస్తున్నారు. దీంతో 'సాహో' దర్శక నిర్మాతలు బాలీవుడ్ హీరోయిన్ ను ప్రభాస్ సరసన నటింపజేస్తే సినిమాకు ప్లస్ అవుతుందని కత్రినా కైఫ్, శ్రద్ధా కపూర్, దిశా పటానీ తదితర హీరోయిన్లను సంప్రదించారు. అయితే కత్రినా తొలుత దర్శక, నిర్మాతలను తిప్పించుకుంది. 'బాహుబలి-2:ద కన్ క్లూజన్' విడుదలై విజయం సాధించేంత వరకు ప్రభాస్ ను పట్టించుకోలేదు.
అయితే ఎప్పుడైతే 'బాహుబలి-2:ద కన్ క్లూజన్' సినిమా విజయం సాధించిందో... 'సాహో'లో తానే హీరోయిన్ అంటూ లీకులిస్తోందట. మరోపక్క, శ్రద్ధా కపూర్ అయితే టాలీవుడ్, కోలీవుడ్ కు కొత్త ఫేస్ అని, బాలీవుడ్ లో కూడా ప్లస్ అవుతుందని దర్శక నిర్మాతలు ఆమెను కలవడంతో... కథ నచ్చిందని, ప్రభాస్ సరసన కాబట్టి నటిస్తానని తెలిపింది. అయితే తనకు 8 కోట్ల రెమ్యూనరేషన్ ఇవ్వాల్సిందేనని, ఒక్క పైసా తగ్గినా నటించనని తేల్చిచెప్పింది. దీంతో నిర్మాతలు షాక్ తిన్నారు. ఆమె నటించిన 'రాక్ ఆన్ 2', 'ఓకే జాను' సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. దీంతో అమెకు అంత సీన్ లేదని నిర్మాతలు వెనక్కి తగ్గారు.
దీంతో టాలీవుడ్ లో వరుణ్ తేజ్ సరసన ఎంట్రీ ఇచ్చిన దిశా పటానీని సంప్రదించారు. 'కుంగ్ ఫూ యోగా', 'ఎంఎస్ ధోనీ' హిట్లతో జోరుమీదున్న దిశా పటానీ.. ప్రభాస్ తో నటించాలంటే 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసింది. దీంతో అమ్మడి కాళ్లు నేల మీద లేవని గుర్తించిన దర్శకనిర్మాతలు ఆమెను కూడా వదిలేశారు. ఇప్పుడు అనుష్క పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రభాస్, అనుష్క జోడీ ఖాతాలో 'బిల్లా', 'మిర్చి', 'బాహుబలి', 'బాహుబలి-2:ద కన్ క్లూజన్' వంటి సూపర్ హిట్లున్నాయి. అయితే 'బాహుబలి-2:ద కన్ క్లూజన్' తరువాత సినిమాలను అంగీకరించని అనుష్క ఈ సినిమాలో నటించేందుకు అంగీకరిస్తుందా? అన్నదే అనుమానం.