: వైసీపీ తీరు చూస్తుంటే ‘కాపురం చేయలేం కానీ, శోభనానికి ఓకే’ అన్నట్టుంది!: మంత్రి సోమిరెడ్డి సెటైర్
వైఎస్సార్సీపీ తీరుపై ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘కాపురం చేయలేం కానీ, శోభనానికి ఓకే’ అన్నట్టుగా ఆ పార్టీ తీరు ఉందని విమర్శించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీబీఐ, ఈడీ ధాటికి ఎవరితో స్నేహం చేయాలో, ఎవరితో కాపురం చేయాలో తెలియని పరిస్థితిలో జగన్ ఉన్నారన్నారు. రాష్ట్రపతినే కలిసిన జగన్, ప్రధానితో భేటీ అయితే తాము ఎందుకు ఇబ్బంది పడతామని ఆయన ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై ప్రధానిని కలిశామని చెప్పి, రాజకీయాలు మాట్లాడారని సోమిరెడ్డి విమర్శించారు. అవినీతి పరుల విషయంలో మోదీ చండశాసనుడని, ఆయన వద్ద జగన్ ఆటలు సాగవని అన్నారు. రాష్ట్ర పునర్విభజన జరిగిన తర్వాత కనీసం ముప్పై రాత్రుళ్లయినా జగన్ ఏపీలో నిద్ర చేశారా? అని ఆయన ప్రశ్నించారు.