: తమిళమంత్రి సరోజపై అధికారి సంచలన వ్యాఖ్యలు.. రూ.30 లక్షలు లంచం అడిగారని ఆరోపణ.. కమిషనర్‌కు ఫిర్యాదు
తమిళనాడు సాంఘిక సంక్షేమ శాఖామంత్రి సరోజపై ధర్మపురి జిల్లా శిశిసంక్షేమ శాఖ అధికారిణి రాజామీనాక్షి సంచలన ఆరోపణలు చేసి కలకలం రేపారు. తాను అధికారిగా కొనసాగాలంటే రూ.30 లక్షలు ఇవ్వాలని మంత్రి డిమాండ్ చేశారని ఆరోపించారు. అంతేకాదు.. ఈ నెల 7న ఇంటికి పిలిపించి మరీ బెదిరించారని తెలిపారు. మంత్రి చెప్పిన మాటలు వినకుంటే ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందనే ఉద్దేశంతో అక్కడి నుంచి ఇంటికి చేరుకున్నట్టు తెలిపారు. ఈ మేరకు గురువారం మంత్రిపై చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
జయలలిత మరణం తర్వాత శిశుసంక్షేమ శాఖలో అధికారిగా తనను సరిగా పనిచేయకుండా అడ్డుకున్నారని, మంత్రి సరోజ వల్ల ఎంతో ఒత్తిడి అనుభవిస్తున్నానని ఫిర్యాదులో పేర్కొన్నారు. రూ.10 లక్షలు తీసుకుని విధులకు ఉత్తర్వులు ఇస్తానని చెబుతున్నారని, మంత్రి భర్త సైతం తనను బెదిరించారని తెలిపారు. దీంతో ఫిబ్రవరిలో రూ.10 లక్షలు చెల్లించినట్టు పేర్కొన్నారు. వివిధ కారణాల రీత్యా తనను చెన్నై బదిలీ చేయాల్సిందిగా మంత్రిని కోరితే తనను ఇంటికి పిలిపించి రూ. 30 లక్షలు డిమాండ్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
'నీకు అండగా నిలిచేవారేవరు లేర'ని బెదిరించిన మంత్రి ఈ నాలుగేళ్లలో తాను కనీసం రూ.4 వేల కోట్లు సంపాదించాల్సి ఉంటుంది కాబట్టి ప్రస్తుత రేటు ప్రకారం రూ.30 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారని తెలిపారు. లేదంటే అంత డబ్బు ఇచ్చే వారికి బాధ్యతలు అప్పగిస్తానని హెచ్చరించారని పేర్కొన్నారు. అంతేకాదు.. తన ఆదేశాలను ధిక్కరించినా, లంచం విషయం బయటకు పొక్కినా ఉద్యోగం ఊడడంతోపాటు నామరూపాలు లేకుండా చేస్తానని బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని పోలీస్ కమిషనర్‌ను వేడుకున్నారు. విషయం తెలిసిన విపక్షాలు మంత్రి సరోజపై విమర్శలు గుప్పించాయి. ఆమెను బర్తరఫ్ చేయాలని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ డిమాండ్ చేశారు.