: టాయిలెట్ వాడినందుకు ఇంత బిల్లా?... భారత రెస్టారెంట్ నిర్వాకంపై సెటైర్లు!


దక్షిణాఫ్రికాలోని డర్బన్ లో 'జాలీ గ్రూబర్' అనే పేరుతో ఉన్న భారత రెస్టారెంట్ అది. అక్కడికి వెళ్లిన ఇద్దరు రెస్టారెంట్ లో ఎలాంటి ఆహారాన్ని ఆర్డర్ చేయకుండా టాయిలెట్ వాడుకోగా, రూ. 190 బిల్లేసి సోషల్ మీడియాకు ఎక్కింది. భారత సంతతికి చెందిన దక్షిణాఫ్రికా జంట ఆ హోటల్ కు వెళ్లి తమకు ఎదురైన అనుభవాన్ని సామాజిక మాధ్యమాల్లో ఉంచింది. రిజా ఖాన్ అనే వ్యక్తి తనకిచ్చిన బిల్లును చూపుతూ ఈ పోస్టును పెట్టాడు. ఏప్రిల్ 30వ తేదీతో ఉన్న ఈ బిల్లులో ఒకరు టాయిలెట్ వాడుకున్నందుకు 20 రాండ్లు (సుమారు రూ. 90) చొప్పున ఇద్దరికి 40 రాండ్లు, ఆపై విలువ ఆధారిత పన్నుగా 4.91 రాండ్లు వసూలు చేసింది.

తన జీవితంలో మూత్ర విసర్జనకు చెల్లించిన అత్యధిక మొత్తం ఇదేనని రిజా ఖాన్ వ్యాఖ్యానించాడు. కాగా, టాయిలెట్లు జాలీ గ్రూబర్ కస్టమర్లకు మాత్రమేనని, కేవలం కూల్ డ్రింక్స్ కొనుగోలు చేస్తే టాయిలెట్ వాడేందుకు అర్హత ఉండదని, చెప్పకుండా వాడుకుంటే చర్యలు తప్పవని హోటల్ ముందు ఓ బోర్డు కూడా ఉండటం గమనార్హం. ఇక అదే బోర్డులో తమ మానవత్వాన్ని ఎవరూ ప్రశ్నించక్కర్లేదని, పక్కనే ఉచిత టాయిలెట్లు ఉన్నాయని కూడా బోర్డులో ఉంచింది. తమ రెస్టారెంటులో పబ్లిక్ టాయిలెట్ లేదని ముందే చెప్పినా, వారు వచ్చారని యాజమాన్యం చెప్పగా, టాయిలెట్ వాడినందుకు ఇంత బిల్లు వేస్తున్నారా? అంటూ నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు.

  • Loading...

More Telugu News