: జడేజా ‘న్యూ లుక్’కు కారణం చెప్పేశాడు!
టీమిండియా ఆటగాడు రవీంద్ర జడేజా న్యూ లుక్ లో కనబడటానికి గల కారణాన్ని చెప్పేశాడు. టీమిండియా ఆటగాళ్లందరూ డ్రెస్సింగ్ రూంలో ఒకేలా గడ్డాలు పెంచుకుని దర్శనమిస్తుంటారని అన్నాడు. ఈ సందర్భంగా టీమిండియా కోచ్ అనిల్ కుంబ్లేతో నడుస్తుండగా జరిగిన ఓ సంఘటనను జడేజా ప్రస్తావించాడు.
అనిల్ కుంబ్లేతో కలిసి నడుస్తున్న సమయంలో, కుంబ్లే తనను కేఎల్ రాహుల్ లా భావించి కన్నడలో మాట్లాడటం మొదలు పెట్టాడన్నాడు. భారత ఆటగాళ్లందరికీ ఒకేలా గడ్డాలు ఉండటంతో అందరినీ అయోమయానికి గురి చేస్తున్నాయని, అందుకే, కొత్తగా కనపడాలనే ఉద్దేశంతో న్యూలుక్ పొందానని జడేజా చెప్పాడు. కాగా, జడేజా న్యూలుక్ ను రోహిత్ శర్మ, హార్దిక పాండ్యా, అజింక్యా రహానేలు అనుసరించారు. కోహ్లీ మాత్రం అందుకు వీలుపడదని ట్వీట్ చేయడం తెలిసిందే. ఈ ట్వీట్ పై కోహ్లీ ప్రియురాలు అనుష్క శర్మ ‘నీ వల్ల కాదు’ అని స్పందించడమూ విదితమే.