: క్రికెట్ ని హాకీ క్లీన్ బౌల్డ్ చేసేసింది: సెహ్వాగ్ ఆసక్తికర అభినందనలు
నిశ్చితార్ధం చేసుకున్నామని ప్రకటించిన టీమిండియా మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్, బాలీవుడ్ నటి సాగరికా ఘాట్గేకు శుభాకాంక్షల వర్షం కురుస్తోంది. జహీర్ కు మాజీ సహచరులంతా శుభాకాంక్షలు చెబుతున్నారు. ట్విట్టర్ కింగ్ గా నీరాజనాలు అందుకుంటున్న వీరేంద్ర సెహ్వాగ్...‘హాకీకి క్లీన్ బౌల్డ్ అయిన జహీర్ ఖాన్ కు శుభాకాంక్షలు. సాగరికా, దయచేసి జహీర్ కు హాకీ ఇవ్వకండి. ఇద్దరూ కలకాలం బాగుండాలి’ అంటూ శుభాకాంక్షలు తెలిపాడు. మరో సహచరుడు యువరాజ్ సింగ్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు చెబుతూ, ‘జీవితంలో మరో వైపునకు స్వాగతం జహీర్. అది మీ ఇద్దరికీ బాగుంటుందని ఆశిస్తున్నా. శుభాకాంక్షలు’ అంటూ ట్వీటాడు.
జహీర్ కెరీర్ లో అంతర్జాతీయ క్రికెట్ లో స్వాగతం పలికిన అతని కెప్టెన్ సౌరవ్ గంగూలీ, ‘వెల్ డన్ జహీర్. మంచి నిర్ణయం తీసుకొన్నావు. గాడ్ బ్లెస్’ అంటూ ఆశీర్వదించాడు. దిగ్గజ క్రికెటర్ రవిశాస్త్రి, నిశ్చితార్థం సందర్భంగా మీ ఇద్దరికీ అభినందనలు అంటూ ట్వీట్ చేశాడు. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్, జహీర్, 'సాగరికకు శుభాకాంక్షలు. మీ జీవితాల్లో ప్రేమ, సంతోషం నిండాలి. జీవితానికి సరైన జోడీని ఎంచుకున్నావు' అంటూ ట్వీట్ చేశాడు. ఇలా తన సహచరుల శుభాకాంక్షలు అందుకుంటూ జహీర్ ఆనందంగా ఉన్నాడు.