: సరిగ్గా పెళ్లి ముహూర్తం సమయానికి పెళ్లికొడుకు జంప్!
ఆ యువతి, యువకుల మధ్య రెండేళ్ల క్రితం స్నేహం ఏర్పడింది. వారి స్నేహం ప్రేమకు దారి తీసి, చెట్టాపట్టాలు వేసుకొని తిరిగారు. ఒకరు లేకుండా మరొకరు బ్రతకలేనట్లు వ్యవహరించారు. వారి ప్రేమ ఇరు కుటుంబాల పెద్దలను కూడా మెప్పించి, వారికి పెళ్లి చేయడానికి సిద్ధపడ్డారు. పెద్దలంతా మాట్లాడుకుని పెళ్లి ముహూర్తం ఖరారు చేసుకొని, బంధుమిత్రులందరినీ పిలిచి, వైభవంగా వేడుక నిర్వహిస్తున్నారు. పెళ్లి ముహూర్తం దగ్గరపడుతుండడంతో పెళ్లి తంతులో భాగంగా నిర్వహించాల్సిన ఇతర కార్యక్రమాల కోసం పురోహితుడు 'పెళ్లికొడుకుని తీసుకురండీ' అని చెప్పాడు. అయితే, వరుడి బంధువులకి పెళ్లికొడుకు కనిపించడకుండా పోయాడు.
సినిమా కథను తలపించేలా జరిగిన ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేటలో నిన్న చోటుచేసుకుంది. బిత్తరపోయిన పెళ్లికూతురి బంధువులు, తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. నరసన్నపేటలోని సూర్యనారాయణ స్వామి కల్యాణ మండపంలో ఈ పెళ్లి చేయడానికి తాము వేలాది రూపాయలు ఖర్చు పెట్టామని తెలిపారు. సరిగ్గా ముహూర్త సమయానికి పెళ్లికొడుకు ప్రదీప్ స్వామి కనిపించలేదని చెప్పారు. అయితే, పెళ్లి కొడుకు వచ్చేస్తాడని వధువు బంధువులు ఒక గంటసేపు కాలక్షేపం చేశారని చెప్పారు. వరుడి ఫోను కూడా స్విచ్ఆఫ్ అయిందని తెలిపారు. ప్రేమికుడు చివరి నిమిషంలో ఇలా ఎందుకు చేశాడో తనకు అర్థం కావడం లేదని వధువు రాజ్యలక్ష్మి చెప్పింది.