: హవ్వ... 4 బంతుల్లో 92 పరుగులు.. బంగ్లాదేశ్ బౌలర్ చెత్త రికార్డు!
బంగ్లాదేశ్‌లోని ఢాకా సెకండ్ డివిజన్ క్రికెట్ లీగ్‌లో ఓ బౌలర్ ఇప్పటివరకూ ఎవ్వరూ సాధించలేని ఓ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. నాలుగు బంతులు వేసి 92 పరుగులిచ్చాడు. లీగ్‌లో భాగంగా నిన్న ఆక్సియమ్, లాల్మాటియా క్లబ్‌ల మధ్య మ్యాచ్ జరిగిన సందర్భంగా లాల్మాటియా జట్టు ఓపెనింగ్ బౌలర్ సుజన్ మహ్మద్ బౌలింగ్‌లో ఈ రికార్డు నమోదైంది. తొలి ఓవర్‌లోబౌలింగ్ చేస్తోన్న మహ్మద్.. మొత్తం 15 నోబాల్స్ వేశాడు. ఈ క్రమంలోనే 13 వైడ్లు వేయగా ఆ బంతులన్నీ ఫోర్లు వెళ్లాయి.
ఇక నాలుగు బాల్స్‌లో 12 పరుగులు ఇచ్చుకున్నాడు. మొత్తం 80 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చాయి. దీంతో 4 బంతులకే మొత్తం 92 పరుగులు వచ్చాయి. మరోవైపు మొదట బ్యాటింగ్ చేసిన లాల్మాటియా జట్టు 14 ఓవర్లలో 88 పరుగులకే ఆలౌటైంది. తొలి ఓవర్ మొదటి నాలుగు బంతులకే ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ప్రత్యర్థి జట్టు లక్ష్యాన్ని చేరుకుంది.
అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో అత్యధికంగా 36 పరుగులు వచ్చిన రికార్డు మాత్రమే ఉంది.
అయితే, లాల్మాటియా క్లబ్ జనరల్ సెక్రటరీ అదనన్ రెహమాన్ ఈ విషయంపై మాట్లాడుతూ... తాము కావాలనే ఇలా చేశామని అన్నారు. ఈ మ్యాచ్ లో టాస్ ఎవరు గెలిచారో కూడా తమ కెప్టెన్‌ను అంపైర్లు చూడనివ్వలేదని, దీంతో అసహనంతో నాలుగు బంతుల్లోనే మ్యాచ్‌ను ముగించేశామని వ్యాఖ్యానించారు.