: విమానం నిండిపోయిందట.. సీట్లోంచి ప్రయాణికుడిని ఈడ్చుకుపోయారు!
ప్రయాణికులతో విమానం నిండిపోయిందని పేర్కొంటూ ఓ ప్రయాణికుడిని అందులోంచి ఈడ్చుకెళ్లిన ఘటన యునైటెడ్ ఎయిర్లైన్స్ కు చెందిన విమానంలో చోటుచేసుకుంది. షికాగో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో జరిగిన ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. కెంటకీలోని లూయిస్ విల్లే యునైటెడ్ 3411 విమానంలో ఎక్కి కూర్చున్న ఓ ప్రయాణికుడి వద్దకు వచ్చిన సిబ్బంది ఆయనను దిగాలని చెప్పారు. అయితే, ఆ ప్రయాణికుడు అందుకు ఒప్పుకోకపోవడంతో అతడి చొక్కా పట్టుకుని బలవంతంగా ఈడ్చుకుపోయారు సిబ్బంది. ఆ ప్రయాణికుడు కిందపడిపోయినా అలాగే విమానం బయటకు లాక్కెళ్లారు.
సదరు ప్రయాణికుడు ఆసియా వాసి అని తెలుస్తోంది. తాను వైద్యుడినని, తాను తప్పనిసరిగా తన స్వస్థలానికి వెళ్లాలని చెబుతున్నప్పటికీ విమాన సిబ్బంది వినిపించుకోలేదని తోటి ప్రయాణికులు చెప్పారు. తనను బయటకు లాక్కెళ్లినప్పటికీ ఆ ప్రయాణికుడు మళ్లీ విమానంలోకి వచ్చాడని, ఆ సమయంలో 'కావాలంటే నన్ను చంపేయండి.. చంపండి.. నేను మాత్రం ఇంటికి వెళ్లాలి' అని అన్నాడని చెప్పారు. ఈ ఘటనపై యునైటెడ్ ఎయిర్లైన్స్ సంస్థ క్షమాపణలు చెప్పబోమని తేల్చి చెబుతోంది.