: చెన్నైలో కుంగిపోయిన అన్నాశాలై రోడ్డు!..భూమి లోకి దిగబడిపోయిన వాహనాలు!
చెన్నైలోని అన్నాశాలై రోడ్డు అకస్మాత్తుగా కుంగిపోయింది. ఈ ఘటనలో ఆర్టీసీ బస్సు, కారు రోడ్డులోకి దిగబడిపోయాయి. అయితే, అందులోని ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం వాటిల్లలేదు. ఈ రోజు మధ్యాహ్నం ఈ సంఘటన జరిగింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం, మధ్యాహ్న సమయం కావడం, వాహనాల రద్దీ అంత ఎక్కువగా లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రోడ్డుపై వెళుతున్న వాహనాలు ఒక్కసారిగా భూమిలోకి దిగబడిపోవడంతో వాహన చోదకులకు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. కాగా, ఈ రోడ్డు కుంగిపోవడం ఇదేమి తొలిసారి కాదు. వారం రోజుల క్రితం కూడా ఇటువంటి సంఘటన జరిగింది. ఆ రోడ్డు కింద పైపు లైన్ ఉండటంతో ఈ సంఘటనలు పునరావృతం అవుతున్నాయని, ఈ విషయమై అధికారులు దృష్టి సారించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.