: మరో దుస్సాహసానికి దిగిన ఉత్తర కొరియా!


తమ చిరకాల ప్రత్యర్థి దక్షిణ కొరియాతో పాటు చైనా, అమెరికా, జపాన్ లను హెచ్చరించాలన్న ఉద్దేశంతో ఉత్తర కొరియా మరో దుస్సాహసానికి దిగింది. బుధవారం నాడు ఖండాంతర క్షిపణిని జపాన్ ప్రాదేశిక సముద్ర జలాల్లోకి ప్రయోగించి వార్తల్లో నిలిచింది. ఈ విషయాన్ని అమెరికా సైనిక వర్గాలు, దక్షిణ కొరియా వార్తా సంస్థలు స్పష్టం చేశాయి. ఇది కేఎన్-15 మీడియం రేంజ్ బాలిస్టిక్ క్షిపణి అని అమెరికా వర్గాలు పేర్కొన్నాయి. చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ లు సమావేశం కానున్న నేపథ్యంలో కిమ్ జాంగ్ ఉన్ నేతృత్వంలో ఈ క్షిపణి పరీక్ష జరపడం గమనార్హం.

అణు క్షిపణి పరీక్షలు కూడదని అమెరికా పలుమార్లు హెచ్చరిస్తున్నా, పట్టించుకోని కిమ్, దగ్గరుండి మరీ తమ క్షిపణుల పనితీరును పరిశీలిస్తున్నారు. కొరియా ఇప్పటివరకూ ఐదు సార్లు క్షిపణి పరీక్షలు చేసిన సంగతి తెలిసిందే. భవిష్యత్తులోనూ మరిన్ని అణు పరీక్షలకు కిమ్ ఆదేశించవచ్చని సమాచారం. ఉత్తర కొరియా తాజా పరీక్షలను తీవ్రంగా ఖండించిన జపాన్, ఇక ఆ దేశ చర్యలను తేలికగా తీసుకోబోమని స్పష్టం చేసింది. కాగా, రేపు, ఎల్లుండి ట్రంప్, జిన్ పింగ్ లు సమావేశం కానున్నారు.

  • Loading...

More Telugu News