: నాకేం నష్టం లేదు.. బొజ్జలను తీసేయడమే బాధను కలిగిస్తోంది: ఎమ్మెల్యే తోట


తనకు మంత్రి పదవి ఇవ్వడం, ఇవ్వకపోవడం అనేది ముఖ్యమంత్రి నిర్ణయమని తూ.గో.జిల్లా రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు అన్నారు. మంత్రి వదవి ఇవ్వకపోయినా తనకు వచ్చే నష్టం ఏమీ లేదని ఆయన తెలిపారు. మంత్రి పదవి రాని నేపథ్యంలో, తనను కలసిన అభిమానులతో మాట్లాడుతూ తోట ఈ వ్యాఖ్యలు చేశారు. 2019లో జరగబోయే ఎన్నికల్లో మేలు జరుగుతుందనే కోణంలోనే ఈమేరకు మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసి ఉంటారని తోట చెప్పారు.

కాపు ఉద్యమానికి అండగా ఉంటూనే, అన్ని సామాజికవర్గాల మద్దతుతో ప్రజా సేవకు అంకితమవుతానని తోట తెలిపారు. కేవలం కాపు సామాజికవర్గానికి చెందిన వారే కాకుండా, అన్ని వర్గాల వారు తాను మంత్రి కావాలని కోరుకున్నారని... ఇది తనకు చాలా సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. ప్రజాభిమానాన్ని మించిన పదవి లేదని ఆయన అన్నారు.  ఇంతమంది ప్రజల కోరికను నెరవేర్చాలన్న ఆలోచన పార్టీ నాయకత్వానికి రాకపోవడం తనకు అర్థం కావడం లేదని చెప్పారు. అయితే, సీనియర్ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని మంత్రి పదవి నుంచి తొలగించడం తనను ఎంతో బాధించిందని ఆయన తెలిపారు. వయసు పైబడినప్పటికీ, పార్టీ కోసం బొజ్జల ఎంతో కష్టపడ్డారని... ఆయనను మంత్రి పదవిలో కొనసాగించి ఉంటే తాను ఎంతో సంతోషించేవాడినని చెప్పారు. 

  • Loading...

More Telugu News