: ఓడలు బళ్లు... బళ్లు ఓడలు... మరోసారి నిరూపించిన చంద్రబాబు విస్తరణ!
ఓడలు బళ్లు అవుతాయి, బళ్లు ఓడలు అవుతాయి అన్న సామెత అందరూ తరచూ వినేదే. ఏపీ మంత్రివర్గ విస్తరణ ఈ సామెతను మరోసారి గుర్తు చేసింది. నేడు మంత్రివర్గ విస్తరణ జరగనున్న నేపథ్యంలో పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా పదవీ బాధ్యతలు స్వీకరించనుండగా, మరికొందరు మంత్రిపదవుల నుంచి డిమోట్ కానున్నారు. చీఫ్ విప్ మంత్రి కాగా, మంత్రి చీఫ్ విప్ అయ్యారు. ఐదుగురికి ఉద్వాసన పలుకుతూ, మరో ఆరుగురికి చోటు కల్పిస్తూ, మొత్తం 11 మంది కొత్త ముఖాలతో నవ్యాంధ్ర మంత్రివర్గం నేడు మరోసారి కొలువుదీరనుంది. అమరావతి అసెంబ్లీ ప్రాంగణంలో ఈ మేరకు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేశారు.
కొత్త, పాత కలయికలు, ఉరకలెత్తే యువరక్తం, ఆలోచనలకు పదునుపెట్టే పెద్దరికం... ఇలా అన్ని రకాలైన సమతుల్యతలనూ పాటిస్తూ, ఏపీ సీఎం చంద్రబాబు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కూర్పును గత రాత్రి పూర్తి చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో పాటు, కళా వెంకటరావు, సుజయకృష్ణ రంగారావు, పితాని సత్యనారాయణ, జవహర్, నక్కా ఆనందబాబు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, అమర్ నాథరెడ్డి, ఆదినారాయణరెడ్డి, అఖిలప్రియలు కొత్తగా మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్నారు. అమరావతి సచివాలయంలో ఈ కొత్త మంత్రుల ప్రమాణానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఉదయం 9:27 నిమిషాలకు గవర్నర్ నరసింహన్ వీరితో ప్రమాణం చేయించనున్నారు.
వాస్తవానికి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి నిన్న రోజంతా చంద్రబాబు చర్చలు జరుపుతూనే ఉన్నారు. కొత్త మంత్రుల పేర్లలో కొన్ని ముందుగా ఊహించినవే అయినా, పరిస్థితులను మధించి, అన్ని వర్గాలకూ ప్రాధాన్యత కల్పించేలా ఉద్వాసనలు, చేర్పులు పూర్తి చేసేటప్పటికి బాగా పొద్దుపోయింది. పశ్చిమ గోదావరి, అనంతపురం జిల్లాలపై స్పష్టత రావడానికే ఎక్కువ సమయం పట్టినట్టు తెలుగుదేశం వర్గాలు వెల్లడించాయి.
గుంటూరు జిల్లాలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న మంత్రి రావెల కిశోర్ బాబును తప్పించడం తప్పనిసరి కావడంతో, ఆయన సామాజిక వర్గం మాదిగ కులం నుంచి మరొకరిని ఎంపిక చేసేందుకు పెద్ద కసరత్తే జరిగినట్టు తెలుస్తోంది. రావెల స్థానంలో పశ్చిమ గోదావరికి చెందిన జవహర్ ను ఎంపిక చేశారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో మాల సామాజిక వర్గానికి చెందిన పీతల సుజాతను తప్పించాల్సిన పరిస్థితుల్లో, అదే సామాజిక వర్గానికి చెందిన గుంటూరు జిల్లా ఎమ్మెల్యే నక్కా ఆనందబాబును ఎంపిక చేశారు. కడప జిల్లా నుంచి ఓ ఎమ్మెల్యేను మంత్రిని చేయడం గమనార్హం. వైకాపా నుంచి ఫిరాయించిన ఆదినారాయణరెడ్డికి మంత్రివర్గంలో చోటు లభించింది.
కాగా, కొత్తగా మంత్రిపదవులు లభిస్తాయని ఆశలు పెట్టుకున్న పలువురు ఎమ్మెల్యేలు ఈ విస్తరణ తరువాత నిరుత్సాహపడగా, భవిష్యత్తులో వారికి పదవులు ఇస్తామని చంద్రబాబు ఊరడించారు.