: తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపుకు ఒకే ఒక్క అడ్డంకి!
నియోజకవర్గాల పెంపు కోసం ఇరు తెలుగు రాష్ట్రాల్లోని నేతలు, ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం, ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ స్థానాల సంఖ్యను 175 నుంచి 225కు పెంచుకోవచ్చు. అదే విధంగా తెలంగాణలోని స్థానాలను 119 నుంచి 153కు పెంచుకోవచ్చు. అయితే ఈ సెక్షన్ లోని ఒకే ఒక్క పదం నియోజకవర్గాల పునర్విభజనకు అడ్డంకిగా మారింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 ప్రకారం నియోజకవర్గాలను పెంచుకోవచ్చని విభజన చట్టంలో పెట్టారు.
అయితే, ఆర్టికల్ 17(3) ప్రకారం 2026 తర్వాత ప్రచురించే తొలి జనాభా లెక్కల ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సి ఉంటుంది. అప్పటి వరకు పునర్విభజన చేయడానికి వీల్లేదు. ఇప్పుడిదే నియోజకవర్గాల పెంపుకు అడ్డంకిగా మారింది. సెక్షన్ 26ను రాసినప్పుడే... ఆర్టికల్ 170తో సంబంధం లేకుండా అని రాసి ఉంటే ఇప్పుడు ఈ సమస్య వచ్చి ఉండేది కాదు. ఈ నేపథ్యంలో, నియోజకర్గాల మార్పు కుదరదని అటార్నీ జనరల్, న్యాయ నిపుణులు కూడా కేంద్రానికి సలహా ఇచ్చారు. అయితే, రాజ్యాంగాన్ని సవరించైనా సరే తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాలను పెంచుతామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.