: నాలో 'హీరోయిజం' ఎక్కువగా ఉంటుంది... అందుకే అంత ధైర్యం ప్రదర్శించాను: హీరోయిన్ తాప్సి
తనలో హీరోయిన్ ఇజం కంటే హీరోయిజం ఎక్కువగా ఉంటుందని అంటోంది హీరోయిన్ తాప్సి. దక్షిణాది సినిమాల్లోనే కాకుండా బాలీవుడ్‌లోనూ నటించిన ఈ అమ్మడు తాజాగా తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా పలు విషయాలు తెలిపింది. వారం రోజుల క్రితం ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి తాను ఢిల్లీకి వెళ్లానని చెప్పిన తాప్సీ ఆ గుంపులో ఓ వ్యక్తి తనను వెనుక నుంచి వేలితో పొడుస్తున్నాడని తెలిపింది. అయితే తాను కనీసం అతనెవరో కూడా చూడకుండా, అతని వేలు పట్టుకుని విరిచేశానని తెలిపింది. అందుకే నిజానికి తనలో హీరోయిన్ కంటే హీరోనే ఉంటాడని చమత్కరించింది.
తాను కేవలం పాకెట్ మనీ కోసం కాలేజ్ రోజుల్లో మోడలింగ్‌లో అడుగుపెట్టానని తాప్సీ చెప్పింది. తాను చదువులోనూ ముందుంటానని, క్యాట్ పరీక్షల్లో 88 శాతం మార్కులు తెచ్చుకున్నానని పేర్కొంది. అనంతరం తాను ఎంబీఏ చేద్దామని అనుకుంటుండగా తనకు సినిమాల్లో అవకాశం వచ్చిందని చెప్పింది. తాను నటించిన మొదటి మూడు సినిమాలు సరిగ్గా ఆడకపోవడంతో తనను ఐరెన్ లెగ్ అన్నారని తెలిపింది. అయితే తాను చేసిన ఆ మూడు సినిమాల్లో పెద్ద హీరోలు నటించారని, పేరున్న దర్శకులు ఆ సినిమాలు తీశారని చెప్పిన ఈ అమ్మడు, వారిని వదిలేసి తన వల్లే సినిమా ఆడలేదని అన్నారని వాపోయింది.
తాను ‘పింక్’ సినిమా చేయకముందు వరకు తన పరిస్థితులు ఇలాగే ఉన్నాయని తాప్సీ తెలిపింది. సినీ నిర్మాతలు తనను సినిమాల్లో తీసుకుని అంతా ఓకే అనుకుంటున్న సమయంలో తమకు మరో హీరోయిన్ దొరికిందని చెప్పేవారని, తనకు కనీస చెల్లింపులు కూడా చేసేవారు కాదని తెలిపింది. తనకు అంత గ్లామర్, శరీరాకృతి లేకపోయినా తనలో ఉన్న కళను తాను నమ్ముతానని చెప్పింది. అయినప్పటికీ తనని చూసి తాను జాలిపడబోనని తాను ఎంతో ధైర్యంగా ఉంటానని చెప్పింది.