: 'బావా ఇంటికి రా..' అంటూ తీయగా పిలుస్తుంది.... తరువాతే అసలు కథ మొదలవుతుంది!


ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కూత వేటు దూరంలో ఉన్న కొండపల్లిలో జరుగుతున్న నయాదందా గురించి పోలీసులు వెల్లడించిన విషయాలు చూస్తే... ఔరా అని ఎవరైనా ముక్కున వేలేసుకోక తప్పదు. పోలీసులు వెల్లడించిన వివరాల్లోకి వెళ్తే... ఎంపిక చేసుకున్న ఫోన్ నెంబర్లకు ఓ యువతి ఫోన్ చేస్తుంది... ఫోన్ ఎత్తగానే 'బావా బాగున్నావా?' అంటుంది. అక్కడే బుట్టలో పడిపోతే ఆమె పాచిక పారినట్టే... అలా జరగని పక్షంలో బుట్టలో వేసేందుకు ఆ మధ్య జరిగిన ఓ ఫంక్షన్ లో కలిశానంటూ మాటలు కలుపుతుంది. ఫోన్ లోనే బాగా దగ్గరైపోతుంది... 'ఓసారి ఇంటికి రారాదూ?' అంటూ ఆహ్వానిస్తుంది.

ఇబ్రహీంపట్నంలోని తన ఇంటి అడ్రస్ కూడా ఇస్తుంది. ఆమె మత్తులో మునిగి ఆ ఇంటికి వెళ్లడంతో కొత్త కథ మొదలవుతుంది. ఇంటికి వెళ్లగానే అతిథి మర్యాదలు అదరగొడుతుంది... టీ తెస్తానంటూ వంటగదిలోకి వెళ్తుంది. ఆమె అలా వెళ్లగానే ముగ్గురు వస్తాదులు ఎంట్రీ ఇస్తారు. వారిలో ఒకడు 'నేను లేనప్పుడు నా ఇంటికెందుకొచ్చావురా?' అంటూ వాగ్వాదం ప్రారంభిస్తాడు. ఆమె పిలిచిందని సమాధానం చెప్పేలోపు, 'నా పెళ్లాంతో నేను లేనప్పుడు పనేంట్రా?' అంటూ మీదకి దూకుతాడు. ఒకడు పట్టుకుంటే ఒకడు బట్టలు చించుతాడు. మరొకడు ముఖం మీద పిడిగుద్దులు గుద్దుతాడు. ఈ తతంగం ముగిసేసరికి జేబుగుల్లవుతుంది.
 
తర్వాత బతుకుజీవుడా అని అక్కడి నుంచి బయటపడేసరికి... తిరిగి బ్లాక్ మెయిలింగ్ పర్వం మొదలవుతుంది. ఈ ముఠా సూత్రధారి ఇబ్రహీపట్నం గ్రామపంచాయతీలో ఒక  వార్డు సభ్యుడు. రియల్‌ ఎస్టేట్‌ దందాల్లో ఆరితేరిన అతనికి  కొండపల్లిలో ఇల్లు ఉంది. అదే ఈ గ్యాంగ్‌ అడ్డా. ఆ ఇంట్లో ఓ యువతిని, మరో ఇద్దరు స్నేహితులను ఉంచి, ఆ వార్డు సభ్యుడే  కథ నడిపిస్తున్నాడని పోలీసులు చెబుతున్నారు.

ఈ మధ్యే పటమటకు చెందిన ఓ వ్యక్తిని ఇలాగే దోచుకుంటే... ఆమె ఫోన్ వస్తే చాలు బెంబేలెత్తిపోయేవాడు. ఎందుకీ తలనొప్పి అని భావంచి ఏకంగా ఫోన్ నెంబర్ మార్చేస్తే... అతని అడ్రస్ కనుక్కొని నేరుగా ఇంటికెళ్లి కిడ్నాప్ చేసుకొచ్చి... అతని ఇంటి స్థలం తన పేరుమీద రాయించుకుని సంతకాలు పెట్టించుకున్నారని పోలీసులు చెప్పారు. ఇలాంటి ఫోన్లు వస్తే తమ బలహీనతలు బయటపెట్టుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. 

  • Loading...

More Telugu News