: భారత హైకమిషన్ స్పందించిన తరువాత నాపై చిత్రహింసలు మరింత పెరిగాయి: పాక్ లోని భారతీయ మహిళ
హైదరాబాద్‌కు చెందిన మహ్మదియా బేగం 1996లో దుబాయ్ వ్యక్తి అనుకొని పాకిస్థాన్ యువకుడు మహమ్మద్ యూనస్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని ప్రస్తుతం పాక్‌లో చిత్రహింసలు అనుభవిస్తోన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ స్పందించినప్పటి నుంచి ఆమె చిత్రహింసలు మరింత పెరిగాయి. సుష్మాస్వరాజ్ భారత హైకమిషన్ అధికారులను అప్రమత్తం చేసి, ఆమెకు సహాయం చేయాలని ఆదేశించడంతో విషయాన్ని తెలుసుకున్న మహ్మదియా బేగం అత్తింటి వారు ఆమెను గదిలో బంధించి కొడుతున్నారు. ఈ విషయాన్ని మహ్మదియా బేగం తన తల్లికి ఫోన్ చేసి చెప్పింది. ఓపికగా ఉండాలని, హైకమిషన్ వారు కచ్చితంగా సహాయం చేస్తారని తాను తన కూతురికి చెప్పానని మహ్మదియా బేగం తల్లి తల్లి హజారా బేగం చెప్పింది.
తమ కూతురికి పిల్లల్ని కూడా దూరం చేసేందుకు తన అల్లుడు ప్రయత్నిస్తున్నాడని, భారతీయులంతా హిందువులని వారి వద్దకు వెళ్లకూడదని పిల్లలకు చెబుతున్నాడని ఆమె పేర్కొంది. తన కూతురు ఎంతో నీరసంగా ఉందని, ఆరోగ్యం సరిగా లేదని, ఆమెకు సత్వరమే వైద్యం అందేలా చూడాలని ఆమె కోరారు. తన కూతురితో పాటు తన కూతురి పిల్లలను కూడా భారత్‌కు తీసుకొస్తే బాగుంటుందని ఆమె అన్నారు.