: తమదే ఫాస్టెస్ట్ నెట్ వర్క్ అని అసత్య ప్రచారం చేసుకుంటోంది: ఎయిర్ టెల్ పై జియో ఫిర్యాదు
ఉచిత మంత్రం జపిస్తూ మార్కెట్లోకి అడుగుపెట్టిన రిలయన్స్ జియోపై ఇతర కంపెనీలు మండిపడుతున్న విషయం తెలిసిందే. అలా జియోపై ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న కంపెనీల్లో భారతీ ఎయిర్‌టెల్ కూడా ముందుంది. అయితే, ఎయిర్‌టెల్ తీరుపై రిలయన్స్ జియో మండిపడింది. దేశంలో తమదే ఫాస్టెస్ట్ నెట్ వర్క్ అని చెప్పుకుంటూ ఎయిర్ టెల్ వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించింది. బ్రాండ్ బ్యాండ్ స్పీడ్ టెస్టర్ ఊక్లాతో కలిసి ఎయిర్ టెల్ ఇలా ప్రకటించకుంటోందని పేర్కొంది. ఎయిర్‌టెల్ ప్రకటనలపై అడ్వర్ టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఏఎస్సీఐ) వద్ద రిలయన్స్ జియో ఫిర్యాదు చేస్తూ ఎయిర్ టెల్ ప్రకటన అంతా అసత్యమేనని చెప్పింది.
ఈ అంశంపై ఎయిర్‌టెల్ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. భారత్‌లో అత్యంత వేగవంతమైన మొబైల్ నెట్ వర్క్ తమదేనని ఊక్లా రేటింగ్ ఇచ్చిందని, తమ ప్రకటనలో ఈ విషయాలన్నింటినీ స్పష్టంగా తెలిపామని అన్నారు. ఊక్లా తన పాప్యులర్ స్పీడ్ టెస్ట్ యాప్ ద్వారా మొబైల్ టెస్ట్ లు నిర్వహించి తమ నెట్‌వర్కే అత్యంత వేగవంతమైందని రేటింగ్ ఇచ్చిందని అన్నారు. అయితే, జియో మాత్రం మండిపడుతూ ఊక్లా డబ్బులు తీసుకుని ఇలాంటి అవార్డులు ఇస్తుందని ఆరోపించింది.