: వైఎస్సార్ హయాంలో మహిళలపై దాడులు జరిగినప్పుడు గిడ్డి ఈశ్వరి ఎక్కడుంది?: మంత్రి పీతల సుజాత
ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల తీరుపట్ల ఆంధ్రప్రదేశ్ మంత్రి పీతల సుజాత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆమె మాట్లాడుతూ... మహిళలపై జరిగే దౌర్జన్యాలను తమ ప్రభుత్వం అడ్డుకుని తీరుతుందని చెప్పారు. అయితే, వైఎస్సార్ హయాంలో మహిళలపై దాడులు జరిగిన సమయంలో వైసీపీ నేత గిడ్డి ఈశ్వరి ఎక్కడుందని ఆమె ప్రశ్నించారు. అసలు వైసీపీ సభ్యులకు మహిళలపై మాట్లాడే నైతిక హక్కు లేదని ఆమె అన్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాలు జరగకుండా అడ్డుకున్న వైసీపీ సభ్యులు మీడియా పాయింట్ వద్దకు వచ్చి దొంగ నాటకాలు ఆడుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. తమ క్యారెక్టర్లపై సభలో వైసీపీ నేతలు అసభ్యంగా మాట్లాడారని, అలాంటి వైసీపీ సభ్యులు మహిళల సమస్యలపై మాట్లాడటం హాస్యాస్పదమేనని ఆమె అన్నారు.