: ఉద్యోగుల ప్రయోజనాల్లో కోతపెట్టండి... నిధుల కోసం బ్యాంకులకు మోదీ సర్కారు సూచన
తమకు అవసరమైన మూలధనాన్ని సమీకరించుకోవడం కోసం ఉద్యోగులకు ఇస్తున్న ప్రోత్సాహకాలను తగ్గించుకోవాలని 10 ప్రభుత్వ రంగ బ్యాంకులకు నరేంద్ర మోదీ సర్కారు సూచనలు పంపింది. బ్యాంకింగ్ రంగంలో సాధారణంగా ఉండే వేతనాల పెంపును తగ్గించుకోవాలని, ఈ మేరకు ఉద్యోగులను విధుల్లోకి చేర్చుకోవడానికి ముందే అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని సూచించింది. ముందే వారితో డీల్ కుదుర్చుకుని కొత్త ఉద్యోగాల్లోకి తీసుకోవాలని, తద్వారా మిగిలే డబ్బును మూలధనం కింద వాడుకోవచ్చని తెలిపింది. ఇప్పటికే ఉన్న ఉద్యోగులకు ప్రయోజనాలను తగ్గించే అంశంలో ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాలని, వారు అంగీకరిస్తే, ఎల్టీసీ (లీవ్ ట్రావెల్ కన్సెషన్) వంటి ప్రోత్సాహకాలను కొంతకాలం నిలిపివేయవచ్చని తెలిపింది. బ్యాంకులు తిరిగి వృద్ధిబాటలో నడిచేంత వరకూ వేతన కోత, ప్రోత్సాహకాలపై అదుపు ఉండాలని అభిప్రాయపడింది. ఈ మేరకు యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్ సహా 10 బ్యాంకులకు కేంద్రం నుంచి ఆదేశాలు అందినట్టు సమాచారం.