: 1.6 కోట్ల రూపాయల సైన్స్ అవార్డు గెలుచుకున్న ఇండో అమెరికన్ యువతి
అమెరికాలో స్థిరపడిన భారత సంతతికి చెందిన 17 ఏళ్ల బాలిక అమెరికాలో సైన్సులో అత్యున్నతమైన అవార్డుగా పేర్కొనే ఒక అవార్డును సొంతం చేసుకుంది. న్యూజెర్సీలో నివాసం ఉంటున్న ఇంద్రాణి దాస్ (17) మెదడులో గాయాల వల్ల కలిగే మరణాలను నిరోధించడంపై పరిశోధనలు చేస్తోంది. ప్రధానంగా మెదడులోని నాడీ కణజాల వ్యవస్థపై ఆమె ప్రత్యేకంగా పరిశోధనలు జరుపుతున్నారు. ఈ క్రమంలో ఆమె అమెరికాలో ప్రతిష్ఠాత్మకంగా భావించే రీజనరన్ సైన్స్ టాలెంట్ సెర్చ్ పోటీల్లో పాల్గొంది. రీజనరన్ సైన్స్ టాలెంట్ సెర్చ్ పోటీలను అమెరికాలో జూనియర్ నోబెల్ ప్రైజ్ గా పేర్కొంటారు.
ఈ పోటీల్లో ఆమె ప్రతిభను గుర్తించిన పరిశోధకులు ఆమెకు మొదటి బహుమతిని కట్టబెట్టారు. ఈ పురస్కారం కింద ఆమెకు మొమెంటోతో పాటు 1.6 కోట్ల రూపాయల (2.5 లక్షల డాలర్ల) విలువైన సైన్స్ అవార్డును అందజేయనున్నారు. కాగా, ఈ పోటీల్లో మూడో స్థానంలో నిలిచిన మరో భారతీయ సంతతి వ్యక్తి అర్జున్ రమణి 1.5 లక్షల డాలర్లు గెలుచుకున్నాడు. అర్చనా వర్మ 5వ స్థానంలో నిలిచి 90,000 డాలర్లు, 9వ స్థానంలో నిలిచిన వ్రుందా మదన్ 50,000 డాలర్లు గెలుచుకున్నారు. కాగా, 1942 నుంచి 1998 వరకు ఈ అవార్డు గెలుచుకున్న వారిలో 12 మంది నోబెల్ పుస్కారాన్ని గెలుచుకోవడం విశేషం.