: ప్రమాదకర స్థాయికి ఐఏఎస్ పోస్ట్ ల ఖాళీలు!
దేశ పరిపాలనా వ్యవస్థకు మూలస్తంభం వంటివారైన ఐఏఎస్ అధికారుల కొరత తీవ్ర స్థాయికి చేరింది. బ్యూరోక్రసీలో టాప్ పోస్టుల ఖాళీలు మునుపెన్నడూ లేనంత అధిక స్థాయికి చేరాయి. దేశవ్యాప్తంగా గతేడాది జవవరి 1 నాటికే 1,470 మంది అధికారుల కొరత ఉందని పార్లమెంటరీ ప్యానెల్ తాజాగా పార్లమెంటుకు వెల్లడించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఇన్నేసి ఖాళీలు ఉండడం వల్ల పరిపాలన కుంటుపడే పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఐఏఎస్ అధికారుల కొరత అన్నది 1951 నుంచి ఉన్న సమస్యేనని, అయితే, ప్రస్తుతం పేరుకుపోయిన ఖాళీలు ప్రమాదకర స్థాయికి చేరాయని పార్లమెంటుకు నివేదిక సమర్పించిన పార్లమెంటరీ ప్యానెల్ పేర్కొంది. 6,396 పోస్టులకుగాను 4,926 మందే (77%) ఉన్నారని తెలిపింది.
ఖాళీలను భర్తీ చేసేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టాలని ప్యానెల్ సిఫారసు చేసింది. ఎందుకంటే ప్రస్తుతం ఏటా 180 మంది ఐఏఎస్ లకు శిక్షణ ఇచ్చే వసతులు మాత్రమే ఉన్నాయి. దీంతో అధికారుల శిక్షణకు వీలుగా సామర్థ్యాన్ని పెంచాలని ప్యానెల్ కోరింది. ఈ 1470 ఖాళీల్లో నేరుగా భర్తీ చేయాల్సినవి 900 కాగా, ప్రమోషన్ల ద్వారా రాష్ట్ర అధికారులకు కట్టబెట్టాల్సినవి మిగిలిన ఖాళీలు.