: ముంబై మేయర్ గా విశ్వనాథ్ మహదేశ్వర్.. బేషరతుగా మద్దతిచ్చిన బీజేపీ!
తమ మధ్య నెలకొన్న తాత్కాలిక విభేదాలను బీజేపీ, శివసేనలు పక్కన పెట్టేశాయి. భాయీ భాయీ అంటూ మళ్లీ చేతులు కలిపాయి. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేశాయి. అయితే, ఊహించని విధంగా హంగ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో, ఇరు పార్టీలు మళ్లీ చేతులు కలిపాయి. శివసేనకు మేయర్ పదవిని బీజేపీ బహుమానంగా ఇచ్చింది. దీంతో, శివసేన కార్పొరేటర్ విశ్వనాథ్ మహదేశ్వర్ ముంబై నగర కొత్త మేయర్ గా ఎన్నికయ్యారు.
ఎన్నికలలో ఇరు పార్టీలకు దాదాపు సమానంగా సీట్లు వచ్చిన నేపథ్యంలో, మేయర్ పదవి కోసం శివసేనతో పోటీ పడరాదని బీజేపీ నిర్ణయించింది. అంతేకాదు, శివసేనకు మద్దతు తెలపాలని భావించింది. మహారాష్ట్ర అసెంబ్లీలో శివసేన మద్దతు బీజేపీకి అవసరం ఉండటంతో, మేయర్ పదవిని శివసేనకే ఇవ్వాలని బీజేపీ నిర్ణయించింది. అయితే, బీఎంసీ హాల్ లో బీజేపీ కార్పొరేటర్లు మోదీ మోదీ అని నినదిస్తే... వారికి కౌంటర్ గా శివసేన కార్పొరేటర్లు జై బాలా సాహెబ్ (థాకరే) అంటూ నినదించడం గమనార్హం.