: ట్రంప్ కొత్త ఆదేశాల్లో ఉన్నదేంటి?.. కోర్టులో సవాల్ చేసే అవకాశం ఉందంటున్న నిపుణులు
ఏడు ముస్లిం దేశాలపై ‘ట్రావెల్ బ్యాన్’ విధించి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ట్రంప్ తాజాగా పాత ఆదేశాలకు కొన్ని మార్పులు చేసి కొత్తగా మరోమారు విడుదల చేశారు. గతంలో ఏడు దేశాలపై ఉన్న నిషేధాన్ని ఈసారి ఆరింటికి కుదించి ఇరాక్‌కు మినహాయింపు ఇచ్చారు. మరి కొత్త ఆదేశాల్లో ఏముందన్న చర్చ ఇప్పుడు మొదలైంది. పాత వాటితో పోలిస్తే కొత్త ఆదేశాల్లో ఉన్నది ఒక్క ఇరాక్‌ను మినహాయించడం మాత్రమే. మిగతావన్నీ ఇంచుమించు పాతవే!
అయితే ఇరాక్‌ను జాబితా నుంచి తొలగించడం వెనక బలమైన కారణం ఉందని చెబుతున్నారు. ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్)పై పోరులో ఇరాక్ కీలక భాగస్వామి కావడం కూడా ఓ కారణమని చెబుతున్నారు. ఇరాక్‌లో తనిఖీలు, వీసా స్క్రీనింగ్, డేటా షేరింగ్‌పై ఇప్పటికే ఇరాక్ ప్రభుత్వంతో మాట్లాడానని, ఈ విషయంలో ఆ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సంతృప్తికరంగా ఉండడంతోనే నిషేధ జాబితా నుంచి ఇరాక్‌ను తొలగించినట్టు అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్‌సన్ పేర్కొన్నారు. ఇక కొత్త నిబంధనల విషయానికి వస్తే..
శరణార్థులపై 120 రోజుల నిషేధం ఉంది. అయితే ఇప్పటికే అనుమతి పొందిన శరణార్థులను మాత్రం అనుమతిస్తారు. అయితే ఏడాదికి 50 వేల పరిమితిని విధించారు. సిరియా శరణార్థులపై గతంలో విధించిన నిషేధాన్ని పూర్తిగా ఎత్తివేశారు. నిషేధం విధించిన దేశాల పౌరులకు ఇప్పటికే గ్రీన్‌కార్డు ఉంటే అనుమతిస్తారు. సిరియా నుంచి వచ్చే క్రైస్తవ శరణార్థులకు కొత్త ఆదేశాల్లో ప్రాధాన్యం కరువైంది. పాత ఆదేశాల్లో మతపరమైన మైనారిటీలకు ప్రాధాన్యం ఇచ్చారు. మరోవైపు ట్రంప్ తాజా ఆదేశాల్లో వివాదాస్పద అంశాలు తొలగించినప్పటికీ దీనిని కూడా కోర్టులో సవాల్ చేసే అవకాశం ఉందని న్యాయనిపుణులు చెబుతుండడం గమనార్హం.