: పీవీ సింధుకు డిప్యూటీ కలెక్టర్ పోస్టు ఇచ్చిన ఏపీ ప్రభుత్వం


ఒలింపిక్స్ లో పతకం సాధించడం ద్వారా తెలుగు ఖ్యాతిని చాటిన కుమారి పీవీ సింధుకు డిప్యూటీ కలెక్టర్ పోస్టును ఇవ్వాలని నిర్ణయించినట్టు గవర్నర్ నరసింహన్ ప్రకటించారు. ఈ ఉదయం వెలగపూడి అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఈ విషయాన్ని ఆయన తెలిపారు. ఈ పోస్టును తీసుకునేందుకు ఆమె అంగీకరించారని తెలిపారు. సింధూ ఎంతో మంది అమ్మాయిలకు ఆదర్శంగా నిలిచారని పొగిడారు. రాష్ట్రంలో క్రీడలకు మరింత ప్రోత్సాహాన్ని అందించేందుకు తన ప్రభుత్వం కట్టుబడి వుందని అన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన ఆటగాళ్లకు నగదు ప్రోత్సాహాలను అందిస్తామని వెల్లడించారు. పాఠశాల స్థాయిలోనే క్రీడల్లో ప్రతిభ కనబరుస్తున్న వారిని గుర్తించి, వారు మరింత రాటుదేలేలా శిక్షణను ఇప్పిస్తామని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే విజ్ఞాన రాష్ట్రంగా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని నరసింహన్ వ్యాఖ్యానించారు. అందుకోసం పాఠశాలల్లో డిజిటల్ తరగతులు, బయో మెట్రిక్ హాజరును అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. బడి మానేసే పిల్లల సంఖ్యను తగ్గించేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా సైకిళ్లను పంపిణీ చేశామని అన్నారు. తిరుపతిలో విద్యార్థులను పెద్ద సంఖ్యలో భాగం చేస్తూ నిర్వహించిన సైన్స్ కాంగ్రెస్ అద్భుత రీతిలో విజయవంతం అయిందని చెప్పారు. నిరుద్యోగులకు ఉపాధి కోసం ఎన్నో కార్యక్రమాలను చేపట్టామని, తెలుగు భాషాభివృద్ధికి తెలుగు భాషా ప్రాధికార సంఘాన్ని ఏర్పాటు చేశామని వెల్లడించారు.

  • Loading...

More Telugu News