: నా కుమారులు కార్లలో స్కూళ్లకు వెళ్లే రోజుల్లో... జగన్ కు కనీసం కారు కూడా లేదు!: జేసీ ప్రభాకర్ రెడ్డి
తమ కుటుంబం ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉందని, 1952లోనే తమ తండ్రి రాజకీయాల్లో ఉన్నారని టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. సంపాదించాలనే ధ్యాసే ఉంటే అప్పటి నుంచి తాము ఎన్నో కోట్లు సంపాదించుకునేవాళ్లం అని అన్నారు. తాము కేవలం బతుకుదెరువు కోసమే సంపాదించుకుంటున్నామని... తమరిలా దొంగ సూట్ కేస్ కంపెనీలు పెట్టి, దోచుకోలేదంటూ వైసీపీ అధినేత జగన్ ను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. జగన్ పుట్టినప్పటి నుంచీ అతని పరిస్థితులన్నీ తనకు తెలుసని చెప్పారు. తన కుమారులు కార్లలో స్కూళ్లకు వెళ్లిన రోజుల్లో, జగన్ కు కనీసం కారు కూడా లేదని అన్నారు. జగన్ కుటుంబం కంటే తాము ఎంతో మెరుగ్గా ఉన్నామని అన్నారు.
'ప్రతి ఒక్కరినీ సెంట్రల్ జైలుకు పంపుతామని జగన్ బెదిరిస్తున్నారు... నన్ను జైలుకు ఆయన పంపించేది ఏందయ్యా?' అని జేసీ ప్రశ్నించారు. చట్ట ప్రకారం తనకు శిక్ష పడితే, తానే జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. బస్సు ప్రమాదం అనుకోకుండా జరిగిపోయిందని... మృతుల కుటుంబాలకు ఏం చేద్దామన్న ఆలోచనను వదిలేసి...జగన్ అనవసర రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.