: సింగిల్ పర్మిట్ ఇవ్వకపోతే ఏపీ బస్సులు, లారీలు ఆపేస్తాం: ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్
లారీలకు సింగిల్ పర్మిట్ ఇవ్వాలని కోరినా ఏపీ ప్రభుత్వం స్పందించడం లేదని, పదిహేను రోజుల్లో కనుక ఆ పర్మిట్ ఇవ్వకపోతే కోదాడ వద్దే ఏపీ బస్సులు, లారీలను ఆపి వేస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం దుర్ఘటనపై ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ట్రావెల్స్ బస్సులు బడా నాయకులవి కాబట్టే, ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని, ఈ ప్రమాదానికి కారణమైన దోషులను రాజకీయ ప్రమేయం లేకుండా శిక్షించాలని అన్నారు.
ఈ దుర్ఘటనపై సీఎస్ కు వివరాలు చెప్పి.. తెలంగాణ ప్రభుత్వం కఠినంగా ఉండాలని కోరామని, ప్రైవేట్ ట్రావెల్స్ ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయని, అక్రమంగా అనుమతి పొంది బస్సులు నడుపుతున్నాయని ఆరోపించారు. ప్రైవేటు ట్రావెల్స్ వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కూడా దెబ్బ తింటోందని, ఇటువంటి ఆగడాలకు తెలంగాణలో ఆస్కారం లేదని అన్నారు. ఆర్బీసీ బస్సుల్లో ప్రయాణించడమే ప్రజలకు క్షేమమని ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ సూచించారు.