: యువతులపై వేధింపులు, వైస్ ప్రెసిడెంట్ పై వేటు వేసిన ఉబెర్
తన కింద పనిచేసే యువతులను వేధిస్తున్నట్టు ఆరోపణలు వచ్చిన ఇంజనీరింగ్ విభాగం వైస్ ప్రెసిడెంట్ అమిత్ సింఘాల్ ను రాజీనామా చేసి వెళ్లిపోవాలని క్యాబ్ సేవల సంస్థ ఉబెర్ ఆదేశించింది. నెల రోజుల క్రితమే అమిత్ ఉబెర్ లో చేరడం గమనార్హం. గతంలో గూగుల్, ఆల్ఫాబెట్ తదితర కంపెనీల్లో పనిచేసిన ఆయన, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆయనపై ఉన్న ఆరోపణలను ఆల్ఫాబెట్ సంస్థే స్వయంగా ఉబెర్ దృష్టికి తీసుకు వచ్చినట్టు సమాచారం. దీనిపై సమాధానం చెప్పాలని అమిత్ ను కోరగా, ఆయన సమాధానం ఇవ్వకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సింఘాల్ ను కంపెనీ వదిలి వెళ్లాలని ఆదేశించామని ఉబెర్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.