: మేడమ్.. నేను లావయ్యింది అతిగా తినడం వల్ల కాదు!: శోభా డే వ్యంగ్యానికి కంటతడిపెట్టుకున్న పోలీస్
ప్రముఖ రచయిత్రి, కాలమిస్ట్ శోభాడే రెండు రోజల క్రితం భారీకాయుడైన ఓ పోలీస్ ఫొటో పెట్టి చేసిన ట్వీట్ దుమారం రేపుతోంది. బృహన్ ముంబై కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా విధుల్లో ఉన్న భారీకాయుడైన పోలీసును చూసిన శోభాడే ‘భారీ పోలీస్ బందోబస్తు’ అంటూ అతడి ఫొటో పెట్టి వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ఆమె ట్వీట్‌పై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాలో ఈ ఫొటో అటు తిరిగి ఇటు తిరిగి చివరికి ఆ పోలీసు వద్దకు వెళ్లింది.
దీంతో కన్నీళ్ల పర్యంతమైన ఆయన తన బాధను వ్యక్తం చేశాడు. తనకు 1993లో పిత్తాశయానికి ఆపరేషన్ జరిగిందని, ఆ తర్వాత హార్మోన్లలో అసమతుల్యత వల్ల లావయ్యానని, అంతేకానీ అతిగా తినడం వల్ల కాదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. కావాలంటే మేడమ్ తన చికిత్సకు సాయపడవచ్చంటూ అభ్యర్థించాడు. అందరిలా ఉండాలనే తనకూ ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఆ పోలీస్ పేరు దౌలత్రామ్ జోగావత్ (58). మధ్యప్రదేశ్ పోలీస్ శాఖకు చెందిన ఆయన నీముచ్ పోలీస్ లైన్స్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నాడు. మరి ఆయన ఆవేదనను శోభాడే అర్థం చేసుకుంటారో లేదో వేచి చూడాల్సిందే.
Heavy police bandobast in Mumbai today! pic.twitter.com/sY0H3xzXl3
— Shobhaa De (@DeShobhaa) February 21, 2017