: కామ్రేడ్.. మీకు తలవంచి నమస్కరిస్తున్నా!: పవన్ కల్యాణ్
కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి శతజయంతి సందర్భంగా జనసేన పార్టీ అధినేత, ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా ఆయన్ని గుర్తు చేసుకున్నారు. ఇది.. కామ్రేడ్ తరిమెళ్ల నాగిరెడ్డి శత జయంతి సంవత్సరం అని, ఈ సందర్భంగా చిన్నతనంలో జరిగిన ఓ విషయం తనకు గుర్తుకు వస్తోందని అన్నారు. తాను ఇంటర్మీడియట్ చదువుతుండగా, నాగిరెడ్డి రచించిన ‘తాకట్టులో భారతదేశం’ అనే పుస్తకాన్ని తన తండ్రి తనకు ఇచ్చారని, అయితే, ఆ పుస్తకంలో నాగిరెడ్డి ఆలోచనలు, లోతైన అధ్యయనం, గంభీరత ఉండటంతో ఆ వయసులో తాను గ్రహించలేకపోయానని, ఆ పుస్తకంలో రాసిన వాక్యాలు ఇప్పటి పరిస్థితులకు సరిపోతాయని అన్నారు. ఎంపీగా ఒకసారి, ఎమ్మెల్యేగా నాలుగు సార్లు నాగిరెడ్డి పని చేశారని, భూమి లేని నిరుపేదల కోసం వెయ్యి ఎకరాలను ఆయన దానం చేశారని, అంత గొప్ప వ్యక్తికి తలవంచి నమస్కరిస్తున్నానని ఆ ట్వీట్ లో పవన్ పేర్కొన్నారు.