: కంగనా కోపం చూసి కంగారు పడిన టీవీ ఆర్టిస్టు!
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఆవేశంతో రగిలిపోవడంతో టీవీ ఆర్టిస్టు సుగంధ మిశ్రా ఆందోళన చెందిన ఘటన ముంబైలో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే... 'రంగూన్' సినిమా ప్రమోషన్ లో భాగంగా కంగనా రనౌత్ ‘ది వాయిస్ ఇండియా సీజన్-2’ కార్యక్రమంలో పాల్గొంది. ఈ కార్యక్రమానికి మిమిక్రీ ఆర్టిస్టుగా విశేషమైన పేరు సంపాదించుకున్న సుగంధ మిశ్రా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది. దీనికి గాయకులు సలీం మర్చెంట్, షాన్ లు న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రమోషన్ లో భాగంగా సినిమాకు సంబందించిన విశేషాలను కంగనా వివరించింది.
ఈ సందర్భంగా కంగనా గొంతును అనుకరించాలంటూ సలీం మర్చెంట్, షాన్ లు సుగంధ మిశ్రాను కోరారు. దీంతో ఎంతో మంది గొంతులను అవలీలగా అనుకరించగల సుగంధ.. కంగనా గొంతును కూడా అనుకరించింది. అయితే ఆమె అనుకరణను అవమానంగా ఫీలైన కంగనా... అందరి ముందూ సుగంధ చెంప ఛెళ్లుమనిపించాలని ఉందని చెప్పింది. దీంతో అందరూ అవాక్కయ్యారు. సుగంధ అయితే లాగి కొడుతుందోమోనని ఆందోళన చెందింది. దీంతో సుగంధ వెంటనే సినిమా గురించి అడిగి టాపిక్ మార్చింది.