: పళనిస్వామికి కొత్త తలనొప్పి....జల్లికట్టు తరహా ఉద్యమానికి పిలుపునిస్తున్న యువత
తమిళనాట మరో కలకలం రేగుతోంది. క్యాంపు రాజకీయాల స్థానాన్ని రిసార్టులు ఆక్రమించడంపై తమిళనాడు యువత మండిపడుతోంది. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత రాష్ట్ర పరిస్థితులను పట్టించుకోకుండా శశికళ ఆశీర్వాదం కోసం వెళ్తుండడాన్ని అక్కడి యువత తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా పళనిస్వామి వ్యతిరేక పోస్టులతో హోరెత్తుతోంది. జల్లికట్టు తరహా ఉద్యమానికి సిద్ధం కావాలని యువకులు పిలుపునిస్తున్నారు.
బలపరీక్ష సమయానికి ఆందోళనను తీవ్రతరం చేయాలని, ఓటేసి గెలిపించిన ఎమ్మెల్యేల ఇళ్లను దిగ్బంధించాలని పిలుపునిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, ఇది పన్నీర్ సెల్వం వర్గం పన్నాగమని పళనిస్వామి వర్గం ఆరోపిస్తోంది. బలపరీక్షను అడ్డుకునేందుకు పన్నీర్ సెల్వం చేస్తున్న ప్రయత్నమని, ఆయన పోరాటంతో ఏఐఏడీఎంకే బలహీనపడదని ఆ వర్గం నేతలు స్పష్టం చేస్తున్నారు. కాగా, రేపు తమిళనాడు అసెంబ్లీలో బలపరీక్షను పళనిస్వామి ఎదుర్కోనున్నారు.