: సీమలో టీడీపీకి గుడ్ బై చెప్పిన ముఖ్య నేత గంగుల... నేడు వైకాపాలోకి!
రాయలసీమలో తెలుగుదేశం పార్టీకి ఉన్న ముఖ్యనేతల్లో ఒకరైన గంగుల ప్రభాకర్ రెడ్డి, నేడు జగన్ సమక్షంలో వైకాపాలో చేరనున్నారు. నిన్న ఆళ్లగడ్డలో జరిగిన ఓ సభలో మాట్లాడుతూ, కార్యకర్తలతో చర్చించిన మీదటే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడదీయడంతో మనస్తాపంతోనే తెలుగుదేశంలో చేరానని, ఆపై టికెట్ ఇస్తానని చెప్పి, ఆపై తమ పార్టీ పోటీ చేయబోవడం లేదని చంద్రబాబు చెప్పారని, అయినా సహనం కోల్పోకుండా పార్టీలోనే ఉన్నానని అన్నారు. తన నియోజకవర్గంలోని సర్పంచ్ లు, నాయకులు అంగీకరించడంతోనే వైకాపాలో చేరాలని నిర్ణయించుకున్నానని వెల్లడించారు. తనకు ప్రజల మద్దతు ఉందని చెప్పారు. తన తండ్రి చూపిన దారిలోనే తాను కూడా నడుస్తూ, ప్రజలకు మేలు చేసేందుకు ప్రయత్నిస్తానని అన్నారు.