: బాలకృష్ణ పీఏగా నన్ను నియమించలేదు: పోలుదాసు కృష్ణమూర్తి
హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు బాలకృష్ణ కు కొత్త పీఏగా పోలుదాసు కృష్ణమూర్తిని నియమించారంటూ వార్తలు హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. ఈ వార్తల నేపథ్యంలో టీడీపీ సీనియర్ నాయకుడు, కృష్ణమూర్తి స్పందించారు. ఈ మేరకు ఒక పత్రికకు ఫోన్ చేసి మాట్లాడుతూ, ఈ వార్తలను అవాస్తవమని కొట్టిపారేశారు. నిన్న బాలకృష్ణను కలిశానని, ఆయన పీఏగా తాను హిందూపురం వెళ్లడం లేదని, ప్రస్తుతం జరుగుతున్న టీడీపీ సంస్థాగత ఎన్నికలకు పర్యవేక్షకుడిగా మాత్రమే తాను అక్కడికి వెళుతున్నానని చెప్పారు.
పార్టీకి సంబంధించిన నియామకాల విషయంలో నియోజకవర్గంలో ఎటువంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా, పార్టీ నిబంధనల ప్రకారం అందరినీ కలుపుకుని పోవాలని బాలకృష్ణ సూచించారని చెప్పారు. గ్రూపు రాజకీయాలు లేకుండా చూడాలని, పార్టీ కోసం పాటు పడిన వాళ్లకు తగిన ప్రాధాన్యమిచ్చి కమిటీలను ఏర్పాటు చేయాలని బాలకృష్ణ తనకు సూచించారని కృష్ణమూర్తి పేర్కొన్నారు. ఈ నెలాఖరు వరకు తాను హిందూపురంలోనే ఉంటానని చెప్పిన ఆయన, తాను చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ కు, బాలకృష్ణకు వీరాభిమానినని చెప్పారు.