: వాట్ నెక్స్ట్ ... తారస్థాయికి పన్నీర్ మంతనాలు!
తమిళనాడు ముఖ్యమంత్రి బాధ్యతలు శశికళ చేతికి దక్కబోవని స్పష్టం కావడంతో, పన్నీర్ సెల్వం శరవేగంగా పావులు కదపడం ప్రారంభించారు. ఈ ఉదయం తన ఇంటి వద్ద సందడి చేస్తున్న అభిమానులు, కార్యకర్తలకు పలుమార్లు అభివాదం చేస్తూ, కనిపించిన ఆయన, తన వర్గం నేతలతో కీలక మంతనాలు జరిపారు. తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై ఆయన చర్చించారు. గోల్డెన్ బే రిసార్టులో ఉన్న శశికళ వర్గం ఎమ్మెల్యేల్లో ఎంతమంది తన వర్గంలోకి రావచ్చన్న లెక్కలు తీశారు. గవర్నర్ బల నిరూపణకు అవకాశం ఇస్తే, ఎలా గట్టెక్కవచ్చన్న మార్గాలపై మాట్లాడినట్టు తెలుస్తోంది.
మరోవైపు జయలలిత మేనల్లుడు దీపక్, శశికళ వర్గంలో ఉండటంతో, ఆయనకు పోటీగా, జయ మేనకోడలు దీపను తమవైపు తిప్పుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా పన్నీర్ సెల్వం తన అనుచరులతో చర్చించినట్టు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో దీపకు ప్రజల్లో మద్దతు పెరిగినట్టు అందుతున్న సంకేతాలు, ఆమె హావభావాలు జయను పోలినట్టు కనిపిస్తుండటం, జయలలిత కుటుంబీకులపై తనకు ఎన్నటికీ గౌరవం తగ్గదన్న పన్నీర్ వ్యాఖ్యలతో, ఆమె సైతం పన్నీర్ వర్గంలో చేరిపోవచ్చని తెలుస్తోంది. ఈ సాయంత్రం రాజ్ భవన్ నుంచి ఓ ప్రకటన వస్తుందన్న అంచనాల నేపథ్యంలో, దాన్ని చూసిన తరువాత తదుపరి అడుగులు వేయాలన్నది పన్నీర్ ఆలోచనగా తెలుస్తోంది.