: గౌతమిపుత్ర శాతకర్ణి ఈ ప్రాంతానికి ఆదర్శం: నారా బ్రాహ్మణి
దివంగత నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ రాజకీయాల్లో మహిళల ప్రాధాన్యతను గుర్తించి, వారికి అవకాశం ఇచ్చారని నారా బ్రాహ్మణి అన్నారు. అమరావతిలో రెండో రోజు జరుగుతున్న మహిళా పార్లమెంటేరియన్ సదస్సులో ఆమె మాట్లాడుతూ... ఎన్టీఆర్ మహిళలకు ఇచ్చిన ప్రాధాన్యత వల్లే వారు రాజకీయాల్లో ఇప్పుడు రాణిస్తున్నారని చెప్పారు. గౌతమిపుత్ర శాతకర్ణి ఈ ప్రాంతానికి ఆదర్శమని నారా బ్రాహ్మణి అన్నారు. తల్లిపేరును తనపేరు ముందు కలుపుకొని రాజ్యాన్ని పాలించిన చక్రవర్తి ఆయన అని ఆమె చెప్పారు. ఇలాంటి ప్రాంతంలో ఈ సదస్సు నిర్వహించడం సంతోషమని వ్యాఖ్యానించారు.
మహిళలు ఎదుర్కుంటున్న అనేక సమస్యలను ఈ సదస్సులో చర్చిస్తున్నారని, మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఆమె అన్నారు. మహిళా సాధికారత అనేది కుటుంబం నుంచే రావాలని ఆమె అభిప్రాయపడ్డారు. మహిళలు పనిచేసే చోట వేధింపులు ఎక్కువ అవుతున్నాయని, అవి తొలగిపోవాలని ఆమె అన్నారు.