: వచ్చే ఎన్నికల్లో తమ్ముడి కోసం పని చేయాలని ఉంది: నాగబాబు
జనసేన పార్టీ కోసం పనిచేయమని పవన్ కల్యాణ్ తనను ఏమీ అడగలేదని నటుడు నాగబాబు చెప్పారు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తమ్ముడు పవన్ కల్యాణ్ తన కోసం చాలా చేశాడని, అతని కోసమే తానేమీ చేయలేదని, అందుకే, వచ్చే ఎన్నికల్లో తమ్ముడి కోసం పనిచేయాలని ఉందని తన మనసులో కోరికను నాగబాబు వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో ‘జనసేన’ తరపున స్టార్ క్యాంపెయినర్ గా వ్యవహరించనున్నారా? అనే ప్రశ్నకు నాగబాబు స్పందిస్తూ, ‘వాడే పెద్ద స్టార్. అంతకు మించిన స్టార్ ఎవరుంటారు?’ అని సమాధానమిచ్చారు.
ఈ రోజున పవన్ కల్యాణ్ కు ఉన్న శక్తి ‘మెగా’ ఫ్యాన్స్ అని, వాళ్లందరూ ఆయన వెనుకే ఉన్నారని చెప్పారు. గతంలో జరిగిన ఒక ఆడియో ఫంక్షన్ లో పవర్ స్టార్ ఫ్యాన్స్ పై తాను ఆ తరహా వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందని, భావోద్రేకంతో ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని అన్నారు.