: ఈబేలో అమ్మకానికి నాలుగెకరాల దీవి.. ప్రారంభ ధర రూ.3.4 కోట్లు మాత్రమే!
ఆన్లైన్ షాపింగ్‌లో మనకు కావాల్సిన వస్తువులను ఏరికోరి కొనుక్కునే సౌలభ్యం ఉంటుంది. పిల్లల ఆట బొమ్మల నుంచి గృహోపకరణాల వరకు అన్నింటిని ఒకటికి పదిసార్లు చూసి, రివ్యూలు చదివి కొనుగోలు చేస్తుంటాం. ఆన్లైన్ షాపింగ్ పోర్టల్ ఈబేలోనూ ఇంతే. అయితే విచిత్రంగా ఇటీవల ఆ పోర్టల్‌లో కనిపిస్తున్న ఓ ప్రకటన చూసి వినియోగదారులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈబేలో ఇటువంటివి కూడా కొనుక్కోవచ్చా? అని అవాక్కవుతున్నారు.
బెలిజ్ దేశానికి చెందిన ఓ వ్యక్తి ఆ దేశ తీరప్రాంతంలో ఉన్న నాలుగెకరాల వర్జీనియా కాయె అనే దీవిని అమ్మకానికి పెట్టాడు. అందులో బోల్డన్ని కళాఖండాలు కూడా ఉన్నాయని పేర్కొన్నాడు. దీవిలో నిర్మించిన ఇంటిలో నాలుగు బెడ్రూంలు, చుట్టూ పచ్చని చెట్లు కూడా ఉన్నాయట. సోలార్ విద్యుత్, జనరేటర్ కూడా ఉండడంతో కరెంట్ కోతలు ఉండవని వివరించాడు. అప్పుడప్పుడు డాల్ఫిన్లు కూడా కనిపించి కనువిందు చేస్తాయని తెలిపాడు. ఇన్ని అందాలు, సకల సౌకర్యాలు ఉన్న ఈ దీవి ప్రారంభ ధర జస్ట్ రూ.3.4 కోట్లు మాత్రమేనని, అయితే ఎవరైనా రూ.6.4 కోట్లు ఒక్కసారి చెల్లించి కూడా ఈ ఐలండ్‌ను సొంతం చేసుకోవచ్చంటూ బంపర్ ఆఫర్ ఇచ్చాడు.