: భాగ్యనగరాన్ని కబళిస్తున్న కేన్సర్.. దేశంలోనే మూడోస్థానం
విశ్వనగరం దిశగా వడివడిగా అడుగులు వేస్తున్న భాగ్యనగరం కేన్సర్ కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతోంది. కేన్సర్ బాధిత నగరాల్లో హైదరాబాద్ మూడో స్థానంలో నిలవడం ఆందోళనకు గురిచేస్తోంది. శనివారం ప్రపంచ కేన్సర్ దినోత్సవం సందర్భంగా ఫోరిస్ట్ మెమోరియల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎఫ్ఎంఆర్ఐ) ఓ నివేదికను విడుదల చేసింది. దాని ప్రకారం.. నగరంలో ప్రతి ఏటా కొత్తగా 2400 కేన్సర్ కేసులు నమోదవుతున్నాయి. వీటిలో రొమ్ము కేన్సర్ కేసులే ఎక్కువ కావడం గమనార్హం. దీంతోపాటు ఊపిరితిత్తులు, నోటి, నాలుక, గొంతు కేన్సర్ కేసులు కూడా భారీగానే నమోదవుతున్నాయి.
కేన్సర్ బాధిత రాష్ట్రాల్లో హరియాణా, ఢిల్లీ తర్వాతి స్థానంలో ఉత్తరప్రదేశ్ నిలిస్తే, నగరాల్లో హైదరాబాద్‌కు మూడో స్థానం దక్కినట్టు ఢిల్లీకి చెందిన ఫోరిస్ట్ మెమోరియల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎఫ్ఎంఆర్ఐ) పేర్కొంది. 50-55 ఏళ్లున్న పురుషులు, మహిళలు ఎక్కువగా కేన్సర్ బారిన పడుతుండగా హైదరాబాద్‌లో 15 ఏళ్ల లోపు చిన్నారులు కూడా ఆ మహమ్మారి బారినపడడం ఆందోళనకు గురిచేస్తోంది. 2020 నాటికి దేశంలో కొత్తగా 17.3 లక్షల మంది కొత్తగా కేన్సర్ బాధితులుగా మారుతారని ఎఫ్ఎంఆర్ఐ నివేదిక పేర్కొంది.