: సొంత ప్రభుత్వంపై మంత్రి అయ్యన్న సంచలన వ్యాఖ్యలు.. విశాఖ ఉత్సవం పనికిమాలినదంటూ వ్యాఖ్య
ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు సొంత ప్రభుత్వంపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు. పనికిమాలిన విశాఖ ఉత్సవానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నర్సీపట్నంలో శనివారం నిర్వహించిన డీఎల్డీఏ-పశుసంవర్థకశాఖ ఆధ్వర్యంలో పాలపోటీ, అందాల పోటీ, లేగదూడల ప్రదర్శనలను మంత్రి అయ్యన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా అయ్యన్న మాట్లాడుతూ రైతులకు ఉపయోగపడే ఇటువంటి కార్యక్రమాలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. చందాలు వసూలు చేసి పోటీలు నిర్వహించాల్సి రావడం బాధాకరమన్నారు. పనికిమాలిన ఉత్సవాలపై పెడుతున్న శ్రద్ధ ఇటువంటి వాటిపై పెట్టకపోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలు ప్రభుత్వంలోని అంతర్గత కుమ్ములాటలకు నిదర్శనమని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు తన కేబినెట్ మంత్రులనే చక్కదిద్దుకోలేని స్థితిలో ఉన్నారని విమర్శిస్తున్నాయి. ఇటువంటి ముఖ్యమంత్రి ప్రజలకు ఏదో చేస్తారని ఆశపడడం తీవ్ర తప్పిదమే అవుతుందని ధ్వజమెత్తాయి. మంత్రి అయ్యన్నపాత్రుడు, మరో మంత్రి గంటా శ్రీనివాసరావుకు మధ్య చాలా రోజులుగా విభేదాలు ఉన్నాయి. ఇప్పుడు మంత్రి బహిరంగ వ్యాఖ్యలతో అవి రచ్చకెక్కాయని పార్టీ పెద్దలే చెబుతుండడం గమనార్హం.