: రైలు ప్రయాణికుల నడ్డి విరిచే నిర్ణయాలు తీసుకోనున్న మోదీ సర్కారు!
భారత దేశ చరిత్రలో తొలిసారిగా సాధారణ బడ్జెట్ తో కలిసి రైల్వే బడ్జెట్ పార్లమెంట్ ముందుకు రానున్న వేళ, రైలు ప్రయాణికులపై చార్జీల భారం మోపడం ఖాయమని తెలుస్తోంది. సాలీనా 20 శాతం వృద్ధితో రూ. 1.45 లక్షల కోట్లకు విస్తరించిన భారత రైల్వేల్లో ఇప్పటికీ లాభాల్లోకి నడవాల్సిన విభాగాలు ఎన్నో ఉండగా, ఈ దఫా బడ్జెట్ లో రైల్వే టికెట్ ధరలను స్వల్పంగానైనా పెంచే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నట్టు ఐడీబీఐ కాపిటల్ రీసెర్చ్ హెడ్ ఏకే ప్రభాకర్ తెలిపారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున కొత్త రైళ్ల ప్రతిపాదనలు ఉండక పోవచ్చని, ప్లాట్ ఫాం టికెట్ ధరలతో పాటు, లోకల్ రైళ్లు, సెకండ్ క్లాస్ టికెట్ ధరల పెంపూ ఉండవచ్చని ఆయన అంచనా వేశారు.
ఇక గత కొంత కాలంగా పెరుగుతూ వస్తున్న రైల్వే సెక్టార్ సంబంధిత కంపెనీలు ఈ బడ్జెట్ తరువాత అమ్మకాల ఒత్తిడిలోకి వెళ్లవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. హింద్ రెక్టిఫయర్స్, టిమ్ కెన్ ఇండియా, బీఈఎంఎల్, కెర్నెక్స్ మైక్రో సిస్టమ్స్, టిటాగఢ్ వాగన్స్, టెక్స్ మాకో రైల్, కాళిందీ రైల్ వంటి కంపెనీలు డిసెంబర్ 26 నుంచి జనవరి 27 మధ్య 3 నుంచి 28 శాతం వరకూ వృద్ధిని సాధించగా, ఈ కంపెనీలు బడ్జెట్ డే నాడు నష్టాల్లోకి జారిపోవచ్చని భావిస్తున్నారు.