: కోస్ట్ గార్డ్ నుంచి రూ. 916 కోట్ల కాంట్రాక్టు పొందిన అనిల్ అంబానీ
భారత తీర ప్రాంత రక్షక దళం నుంచి అనిల్ అంబానీ నేతృత్వంలోని అడాగ్ గ్రూప్ రూ. 916 కోట్ల విలువైన భారీ కాంట్రాక్టును పొందింది. ఈ విషయంపై రిలయన్స్ డిఫెన్స్ సంస్థ నేడు స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమాచారం ఇచ్చింది. 14 పెట్రోల్ ఓడల నిర్మాణం నిమిత్తం ఈ డీల్ కుదుర్చుకున్నట్టు అనిల్ అంబానీ వెల్లడించారు. 14 మీడియం, హై స్పీడ్ నౌకలను ఇండియన్ కోస్ట్ గార్డ్ కు అప్పగించనున్నామని ఆయన తెలిపారు. యాంపీ పైరసీ, రెస్క్యూ ఆపరేషన్స్, నిఘా తదితర అవసరాలకు వీటిని వాడవచ్చని, మాడ్యులర్ నిర్మాణ సాంకేతికతతో వీటిని నిర్మిస్తున్నామని అనిల్ అంబానీ తెలిపారు.
కాగా, ఈ డీల్ కోసం లార్సన్ అండ్ టుబ్రో, కొచ్చిన్ షిప్ యార్డ్, గోవా నౌకా నిర్మాణ కేంద్రం, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ తదితర సంస్థలు కూడా బిడ్లను దాఖలు చేయగా, రిలయన్స్ డిఫెన్స్ కు ఆర్డర్ లభించడం గమనార్హం. ఓ ప్రైవేటు రంగ షిప్ యార్డు సంస్థతో ప్రభుత్వం ఈ తరహా డీల్ కుదుర్చుకోవడం ఇదే తొలిసారి కావడంతో రిలయన్స్ డిఫెన్స్ వాటాలకు నేటి మార్కెట్ సెషన్లో ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. సంస్థ ఈక్విటీ వాటా ఏకంగా 6 శాతం పెరిగింది.