: 25 వేల కోట్లకు కంపెనీ అమ్మేసిన భారతీయుడు
ఢిల్లీ ఐఐటీలో విద్యాభ్యాసం పూర్తి చేసిన జ్యోతి బన్సల్ కు చెందిన యాప్ డైనమిక్స్ ను సిస్కో సిస్టమ్స్ టేకోవర్ చేసింది. ఈ టేకోవర్ 25 వేల కోట్ల రూపాయలది కావడంతో బిజినెస్ వర్గాల్లో పెను సంచలనం రేపింది. ఇన్నాళ్లూ కేవలం టెక్నాలజీ డెవలప్మెంట్కు మాత్రమే పరిమితమవుతూ వచ్చిన సిస్కో లాంటి కంపెనీలు ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చెపట్టిన అనంతరం క్లౌడ్ కంప్యూటింగ్ వైపు విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సిస్కో సంస్థ యాప్ డైనమిక్స్ ను 25,000 కోట్ల రూపాయలకు టేకోవర్ చేసింది. ఇంతకుముందు సరిగ్గా వారం క్రితం హ్యూలెట్ పాకార్డ్ (హెచ్పీ) కంపెనీ కూడా సింప్లివిటీ అనే మరో సాఫ్ట్వేర్ కంపెనీని 4,418 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది.
ఈ సందర్భంగా కంపెనీ యాజమాన్యం మాట్లాడుతూ, దీర్ఘ కాలిక వ్యూహాల కోసం ఈ టేకోవర్ ఉపయోగపడుతుందని అన్నారు. కాగా, యాప్ డైనమిక్స్ సంస్థ అప్లికేషన్లను మేనేజ్ చేయడంతో పాటు వాటిని విశ్లేషిస్తుంది. దీంతో ఈ కంపెనీకి 2 వేల మందికి పైగా కస్టమర్లున్నారు. నాస్ డాక్, నైక్, ఇప్పటి వరకు సిస్కో కూడా ఈ కంపెనీ కస్టమరే కావడం విశేషం. అయితే చాలా కాలంగా యాప్ డైనమిక్స్ సంస్థ ఐపీఓకు వెళ్లాలన్న ఆలోచనలో ఉంది. ఇదే తరుణంలోనే సిస్కో మంచి ఆఫర్ చేయడంతో ఎటువంటి ఆలోచనా చేయకుండా విక్రయించేసింది. దీనికి తోడు యాప్ డైనమిక్స్ సంస‍్థకు 2015 నవంబర్ నెలలో వాల్యుయేషన్ చేయిస్తే, దాని విలువ సుమారు 12915 కోట్ల రూపాయలని తేలింది. కానీ, దాదాపు దానికి రెట్టింపు ధరను సిస్కో ఆఫర్ చేయడంతో రెండో ఆలోచన లేకుండా కంపెనీని రికార్డు ధరకు జ్యోతి బన్సల్ విక్రయించారు.