: బంగారు హారాన్ని పోగొట్టుకున్న భక్తురాలు... నిజాయతీగా అప్పగించిన కానిస్టేబుల్!
ఓ భక్తురాలు పోగొట్టుకున్న బంగారు హారాన్ని .. నిజాయతీగా అప్పగించిన కానిస్టేబుల్ విజయకుమార్ ని తిరుమల జేఈవో శ్రీనివాసరాజు అభినందించారు. అలిపిరి చెక్ పోస్ట్ వద్ద ఓ భక్తురాలు తన బంగారు హారం (సుమారు 20 గ్రాములు)ను పోగొట్టుకుంది. తన మెడలో హారం పోయిన సంగతి తెలుసుకున్న ఆ భక్తురాలు తిరుమలలో అధికారులకు ఫిర్యాదు చేసింది.
అయితే, ఆమె హారం పోగొట్టుకున్న సమయంలో అలిపిరి చెక్ పోస్ట్ వద్ద ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ బి. విజయకుమార్ విధులు నిర్వహిస్తున్నారు. ఆ ఆభరణం ఆయనకు దొరకడంతో, దానిని తమ ఇన్ ఛార్జి ఎస్ఐ జగ్గయ్యకు అప్పజెప్పారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన అధికారులు, ఈ విషయమై ఆరా తీయగా.. విజయకుమార్ నిజాయతీగా వ్యవహరించిన విషయం తెలిసింది. తనకు దొరికిన ఆ హారాన్ని నిజాయతీగా తన పైఅధికారికి అందజేసిన విజయకుమార్ ను జేఈవో, ఎస్పీఎఫ్ ఉన్నతాధికారులు అభినందించారు. జేఈవో చేతుల మీదుగా ఆ హారాన్ని సదరు భక్తురాలికి చేరింది.