: సెంచరీతో కదం తొక్కిన యువీ... దూకుడు పెంచిన ధోనీ!
టీమిండియా డాషింగ్ ఆటగాడు యువరాజ్ సింగ్ సెంచరీతో కదంతొక్కాడు. కేవలం 25 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న దశలో క్రీజులో దిగిన యువరాజ్ సింగ్ దూకుడుగా ఆడుతూ సెంచరీ పూర్తి చేశాడు. మ్యాచ్ ప్రారంభం నుంచి స్వేచ్ఛగా బ్యాటు ఝళిపించిన యువరాజ్ సింగ్ కేవలం 98 బంతుల్లో 100 పరుగులు సాధించి సత్తాచాటాడు. దీంతో యువరాజ్ సింగ్ తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు.
కెరీర్ లో ఉత్థానపతనాలను చవిచూసిన యువరాజ్ సింగ్ మరోసారి తానేంటో నిరూపించుకున్నాడు. కెరీర్ పీక్ లో ఉండగా, జట్టుకు రెండు వరల్డ్ కప్ లు అందించిన యువీ అనారోగ్య కారణంగా జట్టుకు దూరమయ్యాడు. తరువాత ఇంచుమించు కెరీర్ ముగిసిందని విమర్శలు వచ్చిన దశలో పునరాగమనం చేశాడు. అయితే నిలకడ లేమి కారణంగా జట్టులో స్థిరమైన స్థానం దక్కించుకోలేకపోయాడు. అలాంటి దశలో రంజీల్లో రాణించి మరోసారి సత్తచాటాడు.
దీంతో బీసీసీఐ నుంచి పిలుపు వచ్చింది. తొలి వన్డేలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన యువీ...రెండో వన్డేలో జూలు విదిల్చాడు. కెరీర్ ఆరంభంలో ఎన్నో భావోద్వేగాలు ప్రదర్శించే యువరాజ్ సింగ్ సుశిక్షితుడైన సైనికుడిలా పరుగులు చేసుకుంటూ పోయాడు. ఏ దశలోనూ పరుగులు సాధించేందుకు ఇబ్బంది పడలేదు. షాట్లు ఆడేందుకు తొందరపడలేదు. దీంతో గతంలో తన సహజశైలిని గుర్తుకు తెచ్చేలా భారీ షాట్లతోపాటు నియంత్రణతో కూడిన షాట్లు ఆడుతూ పరుగుల వరద పారించాడు. ఈ క్రమంలో ధోనీ అర్ధ సెంచరీ చేశాడు. అనంతరం ధోనీ దూకుడు పెంచగా, ఆరంభం నుంచి దూకుడుగా ఆడుతూ యువీ భారీ స్కోరుపై కన్నేశాడు. దీంతో భారత జట్టు 34 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది.